కాలనీ.. కహానీ
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:05 AM
నిరుపేదలకు పక్కా గృహం నిర్మించేందుకు గత వైసీపీ హయాంలో ‘జగనన్న కాలనీ’ పేరిట గృహాలను నిర్మించారు. అయితే వీటిని పూర్తిచేయకపోవడం, కాలనీలో రోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు లేకపోవటంతో గృహాల్లో చేరేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గృహాలు అప్పుడే శిథిలావస్థకు చేరాయి.
నివాస యోగ్యం కాని జగనన్న కాలనీ
అధ్వానంగా రహదారులు, కాలనీలో వర్షపు నీరు
తాగునీటి సౌకర్యం లేక ఆసక్తి చూపని లబ్ధిదారులు
ఆదోని, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి 7 కి.మీ. దూరంలోని ఢణాపురం గ్రామ సమీపంలో గత వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న కాలనీ’ ఏర్పాటు చేసింది. కాలనీలో మొత్తం 5,101 ఇళ్లు మంజూరు కాగా ఇంతవరకూ ఒక్క గృహం కూడా పూర్తికాలేదు. స్టీలు, సిమెంట్, ఇసుకను గృహ నిర్మాణశాఖ అందజేసింది. వీటిలో 3,097 గృహాల ఇంటి మొదటి భాగం ప్లాస్టరింగ్ చేసి రంగు వేశారు. ఇక మిగతా గృహాలు వివిధ స్థాయిలో ఆగిపోయాయయి. వీటిలో 188కి పైగా కాంక్రీట్, 108 రూఫ్ లెవెల్, 28 ఇళ్లు లెంటల్ లెవెల్, 902 ఇళ్లు బేస్‌మెంట్ లెవెల్, 28 ఇళ్లు లెంటల్ లెవెల్, 123 ఇళ్లు ప్లింత్‌భీమ్ లెవెల్, 188 ఇళ్లు బిలో బేస్‌మెంట్ లెవెల్‌లో నిలిచిపోయయి. ఇంకా 427 ఇళ్ల నిర్మాణ పనులు ్ధఇంకా ప్రారంభం లేదు.
ఇప్పటివరకు బిల్లులు మంజూరు
సెంటు స్థలం మాత్రమే ఇవ్వడంతో లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తామే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి, కాంట్రాక్ట్‌ను నెల్లూరు చెందిన జేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ జనార్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి అప్పగించింది. ఒక్కో గృహానికి రూ.1.80 లక్షలు మంజూరుచేసి, పొదుపు మహిళలు రూ.30 వేల రుణం తీసుకునే అవకాశం కల్పించింది. అయితే పొదుపు మహిళలు ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక జగనన్న ఇంటికి ముఖ ద్వారం గోడకు మాత్రమే సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి తెలుపురంగు వేసి లబ్ధిదారులకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కనీస సదుపాయాలు కరువు
కాలనీకి వెళ్లేందుకు రహదారి కూడా సరిగా లేదు. వర్షం దెబ్బకు కోతకు గురై నడిచేందుకు కూడా వీలు కావడం లేదు. బురద ఉండటంతో కాలనీలో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. అలాగే తాగునీటి సదుపాయం లేదు. ప్రభుత్వం మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
అదనపు ఖర్చులు లబ్ధిదారులే భరించాలి
జగనన్న ఇళ్లు ముందు వైపు మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పజెబుతారు.విద్యుత్ వైరింగ్, మిగతా ఖర్చులు లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎస్టీ అయితే రూ.75 వేలు, ఎస్సీ, బీసీ అయితే రూ.50వేలు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక 350 మంది లబ్ధిదారులక బ్యాంకు అకౌంట్‌లో నగదు జమ అయ్యింది. మిగతా వారికి కూడా త్వరలో జమ జమవుతుంది. కాలనీలో రహదారులను నిర్మిస్తాం. - చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గృహనిర్మాణ శాఖ, ఆదోని.