Share News

ఇరిగేషన్‌ను నిర్వీర్యం చేసిన జగన్‌

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:52 PM

గత ఐదేళ్లలో పాలనలో వైఎస్‌ జగన్‌ ఇరిగేషన్‌ శాఖను నిర్వీర్యం చేశారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

ఇరిగేషన్‌ను నిర్వీర్యం చేసిన జగన్‌
మంత్రులతో ఎస్పీ అధిరాజ్‌, కలెక్టర్‌ రాజకుమారి

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

నంద్యాల ఏప్రిల్‌8(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో పాలనలో వైఎస్‌ జగన్‌ ఇరిగేషన్‌ శాఖను నిర్వీర్యం చేశారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆయన నంద్యాలలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. 2014-19లో రూ. 7లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటే.. రూ.72 వేల కోట్ల ఇరిగేషన్‌శాఖకు బడ్జెట్‌ పెట్టామని, 2019-24లో రూ. 12లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటే.. రూ. 31 వేల కోట్లు మాత్రమే గత వైసీపీ సర్కార్‌ కేటాయించిందని విమర్శించారు. ఇందులో సగం ఆ పార్టీవారి అవినీతికి స్వాహా అయిందని ఆరోపించారు. గత సర్కార్‌లో రూ. 18వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నంద్యాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కుందూ నది బ్రిడ్జితో పాటు విశ్వనగర్‌ బ్రిడ్జి తదితర పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నంద్యాలలో సాగునీటికి ఎలాంటి ఇబ్బంది నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ఆయన సతీమణి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సమక్షంలో మంత్రి నిమ్మల రామానాయుడుని కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు ఆంశాలపై ఆరా తీసి సమీక్షించారు.

Updated Date - Apr 08 , 2025 | 11:52 PM