ఈ ఏడాది లేనట్టే..!
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:02 AM
గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయిన తుంగ భద్ర డ్యాం 19వ నంబరు కొత్త గేటును ఈ ఏడాదైనా ఏర్పాటు చేస్తారా? అనే సందేహం కలుగుతోంది.
తుంగభద్ర డ్యాంకు ముందే వచ్చిన వరద గతేడాది ఆగస్టుల్లో
వరదకు కొట్టుకుపోయిన 19వ గేటు
జూన్‌లో కొత్త గేటు ఏర్పాటుకు సన్నాహాలు
ముందస్తు వరద రావడంతో ఆగిపోయిన పనులు
మరో ఏడాదిపాటు వేచి చూడాల్సిందే
గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయిన తుంగ భద్ర డ్యాం 19వ నంబరు కొత్త గేటును ఈ ఏడాదైనా ఏర్పాటు చేస్తారా? అనే సందేహం కలుగుతోంది. టీబీపీ బోర్డు ఇంజనీర్లు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. జూన్ 20వ తేదీ నాటికే క్రస్ట్ లెవల్‌పైన వరద చేరడం, ఎగువన నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో.. ఏపీ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్యనాయుడు సైతం ఈ పరిస్థితుల్లో గేటు ఏర్పాటు రిస్క్ తీసుకోవడం సరైంది కాదని సలహా ఇచ్చారు. దీంతో ఈ ప్రక్రియను వాయిదా వేశారు. ఇప్పటికే డ్యాం గేట్ల పరిస్థితిని అధ్యయనం చేసిన కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్ సంస్థ అన్ని గేట్లు 45 శాతానికిపైగా తప్పుపట్టాయని, తక్షణమే మార్చాలని నివేదిక ఇచ్చారు. కనీసం కొట్టుకుపోయిన ఆ ఒక్క గేటునైనా ఏడాదిగా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కర్నూలు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త జలాశయం తుంగభద్ర 131.29 టీఎంసీల సామర్థ్యంతో 1953లో నిర్మించారు. 212 టీఎంసీలు వినియోగించుకునేలా డిజైన్ చేశారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డు-1 కేటాయింపులు ప్రకారం కర్ణాటక 138.99 టీఎంసీలు, ఉమ్మడి ఏపీ, తెలంగాణకు 73.01 టీఎంసీలు వాడుకోవాలి. డ్యాంలో పూడిక చేరడంతో సామర్థ్యం 105.788 టీఎంసీలకు తగ్గించారు. మూడు రాష్ట్రాల్లో సుమారు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, కోటి మందికిపైగా దాహం తీర్చే జలజీవనాడి తుంగభద్ర జలాశయం. 72 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లు 45 శాతానికి పైగా పటుత్వం కోల్పోయాయని నిపుణులు నిగ్గు తేల్చారు. గతేడాది ఆగస్టులో 19వ నంబరు గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌లను తుంగభద్ర డ్యాంకు పంపించారు. కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కన్నయ్యనాయుడు బృందం రేయింబహుళ్లు కష్టపడి వరదలోనే స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేసి దాదాపుగా 60 టీఎంసీలు కడలిపాలు కాకుండా కపాడారు.
జూన్ ఆఖరిలోగా కొత్త గేటు ఏర్పాటు లక్ష్యం
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ డ్యాం, గేట్లను కేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గేట్లు సామర్థ్యం నిర్ధారణ, రేడియోగ్రఫీ, ఎంపీటీ, అలా్ట్ర సోనిక్, డీపీటీలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్ సంస్థ 32 గేట్ల జీవిత కాలం, స్ట్రెంత్‌ను క్షుణంగా పరిశీలించి మొత్తం గేట్లు 40-50 శాతానికి పైగా స్ట్రెంత్ (బలం) కోల్పోయాయని, అన్ని గేట్లు మార్చాల్సిందేనని నివేదిక ఇచ్చింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్ జైన్, ఏపీ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్యనాయుడు డ్యాంను తనిఖీ చేశారు. నిపుణుల సూచన మేరకు 19వ నంబరు గేటు ఈ ఏడాది జూన్ ఆఖరిలోగా ఏర్పాటు చేసేలా రూ.1.98 కోట్లకు టెండర్లు పిలిచారు అహ్మదాబాద్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. తాత్కాలిక స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్ తొలగించి కొత్త గేటు ఏర్పాటుకు టీబీపీ బోర్డు ఇంజనీర్లతో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం గదగ్‌లోని వర్క్‌షాప్‌లో గేటు తయారు (ఫ్యాబ్రికేషన్) చేసి విడిభాగాలను జూన్ 20న డ్యాం సైట్‌కు చేర్చారు.
పోటెత్తిన వరద.. గేటు ఏర్పాటు వాయిదా
తుంగభద్ర డ్యాం స్విల్‌వే క్రస్ట్ లెవల్ 1,613 అడుగులు. ఆ లెవల్‌లో నీటి నిల్వ 43 టీఎంసీలుగా ఉంటుంది. క్రస్ట్‌లెవల్ కంటే దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడే గేటును ఏర్పాటు చేయాలి. గతేడాది అమర్చిన తాత్కాలిక స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌ను తొలగించి కొత్త గేట్ ఎరెక్షన్ (అమర్చడం) చేయాలంటే 10-15 రోజులు పడుతుంది. జూన్ 20న డ్యాం సైట్‌కు గేటు విడిభాగాలు చేర్చారు. అదే రోజు డ్యాంకు 52 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. వరద తగ్గకపోవడం, క్రస్ట్‌లెవల్ దాటి వరద చేరడం గేటు ఏర్పాటుకు అడ్డంకిగా మారింది. గత నెల 25న ఏపీ జలనవరుల శాఖ సలహదారుడు కన్నయ్యనాయుడు ఈ సమయంలో స్టాప్‌లాగ్ ఎలిమెంట్ తొలగించి, కొత్త గేటు ఎరెక్షన్ చేయడం కష్టంతో కూడుకున్నది.. రిస్క్ తీసుకోవద్దు.. స్టాప్‌లాగ్ గేటు పటిష్టంగా ఉందని సలహా ఇవ్వడంతో గేటు ఏర్పాటును బోర్డు ఇంజనీర్లు వాయిదా వేశారు. గత 15 ఏళ్లుగా డ్యాంలో చేరే వరద రికార్డులు పరిశీలిస్తే.. ఈ సమయంలో సగటున 23.591 టీఎంసీలకు మించి వరద చేరలేదు. ప్రస్తుతం ముందస్తు వర్షాలు వల్ల మే 14న డ్యాంకు వరద మొదలై నెలాఖరుకు 15 టీఎంసీలు చేరాయి. జూన్ 20న డ్యాంలో 50,686 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే.. 22కు క్రస్ట్‌లెవల్ 1,613.28 అడుగుల లెవల్ దాటి 44.460 టీఎంసీలు చేరడమే కాకుండా 25,450 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో 19వ గేట్ ఏర్పాటు మరో ఏడాది వాయిదా పడింది. జనవరిలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ ఆఖరిలోగా గేట్ ఎరెక్షన్ చేసే అవకాశం ఉన్నా నిర్ణయాలు తీసుకోవడంలో టీబీపీ బోర్డు ఇంజనీర్లు నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమనే ఆరోపణలు లేకపోలేదు. ఏప్రిల్ 30న క్రస్ట్ లెవల్ కంటే 28.74 అడుగులకు దిగువన 1,584.26 అడుగులో నీటి నిల్వ ఉంది.
ముందస్తు వరద రావడంతో గేటు ఏర్పాటు వాయిదా
గతేడాది కొట్టుకుపోయిన 19వ నంబరు గేటు జూన్ ఆఖరిలోగా ఏర్పాటు చేయాలని కాంట్రాక్ట్ చేసుకున్న అహ్మదాబాద్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. గదగ్‌లోని వర్క్‌షాపులో గేట్లు ఫ్యాబ్రికేషన్ (తయారు) చేశారు. గత నెల 20న డ్యాంసైట్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో 51 వేల క్యూసెక్కులు వరద కొనసాగుతుంది. క్రస్ట్ లెవల్ 1613 అడుగులపైన వరద చేయడం, ఇన్‌ఫ్లో భారీగా ఉండడంతో ఈ సమయంలో స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్ తొలగించి, కొత్తగేట్ ఏర్పాటు చేయడం రిస్క్‌తో కూడుకున్నది. రిస్క్ వద్దని ఏపీ జలవనరుల శాఖ సలహదారుడు కన్నయ్యనాయుడు కూడా సలహా ఇవ్వడంతో వాయిదా వేశాం. 15 ఏళ్ల వరద రికార్డులు పరిశీలిస్తే మే, జూన్‌లో ఈ స్థాయిలో వరద లేదు.
నారాయణ నాయక్, ఎస్‌ఈ, తుంగభద్ర బోర్డు, హోస్పేట్