రబీకి నీరు లేనట్లే..!
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:27 PM
తుంగభద్ర డ్యాం గేట్లు అమర్చేందుకు బోర్డు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు.
సాగులో ఉన్న పంటలకు జనవరి 10 వరకు..
ఎల్లెల్సీ కింద 35 వేల ఎకరాల్లో సాగు
టీబీపీ డ్యాం గేట్లు అమర్చేందుకు సన్నాహాలు
వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక
తుంగభద్ర డ్యాం గేట్లు అమర్చేందుకు బోర్డు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు ఆఖరులోగా క్రస్ట్ లెవల్ దిగువకు నీటిని తగ్గించి పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. సాగులో ఉన్న పంటల (స్టాండింగ్ క్రాప్)కు జనవరి 10 వరకు సాగునీరు ఇస్తామని టీబీపీ బోర్డు ఇంజనీర్లు తెలిపారు. ఇక రబీకి సాగునీరు ప్రశ్నార్థకమే అని ఇంజనీర్లు అంటున్నారు. ఎల్లెల్సీ కింద సాగులో ఉన్న 35 వేల ఎకరాల ఖరీఫ్ పంటలకు సాగునీటికి ఇబ్బందులు ఉండవు. జనవరి 10 తరువాత డ్యాం నుంచి నీటి సరఫరాను ఆపేస్తారు. తరువాత వేసవి తాగునీటి కోసం జిల్లా యంత్రాంగం ఇచ్చే ఇండెంట్ మేరకు అవసరాన్ని బట్టి నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆయకట్టు రైతులు రబీ పంటను త్యాగం చేయక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా క్రస్ట్‌గేట్ల పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
కర్నూలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కింద ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్‌లో 43,519, రబీలో 1,07,615 ఎకరాలు కలిపి 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 195 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. కేడబ్ల్యూడీటీ అవార్డు మేరకు తుంగభద్ర డ్యాం నుంచి 24 టీఎంసీలు నికర జ లాలు కేటాయించారు. 2025-26 నీటి సంవత్సరంలో 168 టీఎంసీలు లభ్యత ఉంటుందని అంచనా వేసి కేడబ్ల్యూడీటీ అవార్డు దమాషా ప్రకారం 19.019 టీఎంసీలు కేటాయించారు. ఖరీఫ్‌లో 43,519 ఎకరా లకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటే.. ఐఏబీ తీర్మానం మేరకు 35 వేల ఎకరాల్లో రైతులు పత్తి, వరి, మిరప వంటి పంటలు సాగు చేస్తున్నారు. పత్తి, వరి పంటలు చివరి దశలో ఉన్నాయి. మిరప పంట లకు ఫిబ్రవరి ఆఖరి వరకు సాగునీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రబీలో 1.07 లక్షల ఎకరాల ఆయకుట్టు సాగునీరు ఇవ్వాల్సి ఉంది.
గేట్లు అమర్చేందుకు సన్నాహాలు
తుంగభద్ర డ్యాం 19వ నంబరు గేట్ గతేడాది కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో నిపుణుల కమిటీ డ్యాంను పరిశీలించింది. క్రస్ట్‌గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు కాగా.. టీబీపీ డ్యాం గేట్లు ఏర్పాటు చేసి 70 ఏళ్లు కావడంతో జీవిత కాలం తీరిన 33 క్రస్ట్‌గేట్లను తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని ఏకే బజాజ్ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశీ లించిన టీబీబీ బోర్డు 33 గేట్లు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గేట్ల తయారీ పనులు కూడా చేపట్టారు. డిసెంబరు ఆఖరు నుంచి గేట్లు అమర్చేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితంగా డిసెంబరు 20వరకు మాత్రమే ఆయ కట్టుకు సాగునీరు ఇస్తామని మొదట్లో నిర్ణయించారు. శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఐసీసీ సమావేశంలో సాగులో ఉన్న (స్టాండింగ్ క్రాప్) పంటలకు జనవరి 10 వరకు నీటి తడులు ఇవ్వాలని కోరడంతో అప్పటి వరకు సాగునీరు ఇస్తామని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. దీన్నిబట్టి రబీకి సాగునీరు ప్రశ్నార్థకమే అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఎల్లెల్సీ కింద 35 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మిరప దిగుబడులు చేతికి రావాలంటే ఫిబ్రవరి ఆఖరు అయినా నీటిని ఇవ్వాలని కోరుతున్నారు.
రబీ అవసరం 70.032 టీఎంసీలు.. మిగులు 40 టీఎంసీలే
తుంగభద్ర నదికి ఈ ఏడాది భారీ వరదలు వచ్చినా పూర్తిస్థాయిలో 212 టీఎంసీలు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. గతేడాది 19వ నంబరు గేటు కొట్టుకుపోవడం, నిపుణుల కమిటీ 33 గేట్లు మార్చాలని, డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేయరాదని తేల్చి చెప్పింది. టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ మొదట 157 టీఎంసీలు లభ్యత ఉం టుందని అంచనా వేసింది. ఈ తరువాత 168 టీఎంసీలు డ్యాంలో చేరిందని తుది అంచనా వేసి కేడబ్ల్యూడీటీ దమాషా మేరకు మూడు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. అక్టోబరు ఆఖరు వరకు 88.910 టీఎంసీలు వినియోగించుకున్నారు. నవంబరు ఆఖరు వరకు 20.626 టీఎంసీలు, డిసెంబరు ఆఖరు వరకు మరో 18.455 టీఎంసీలు అవసరం ఉందని అంచనా వేశారు. ఈలెక్కన డిసెంబరు ఆఖరుకు 127.991 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ సమయానికి డ్యాంలో 40.008 టీఎంసీలు మాత్రమే మిగులు నిల్వ ఉంటుంది. మూడు రాష్ట్రాల్లో రబీ సాగుకు 70.032 టీఎంసీలు అవసరం ఉంటే డ్యాంలో మిగులు నీరు 40.008 టీఎంసీలే. అంటే.. 30.024 టీఎంసీలు కొరత ఉంది. దీంతో రబీకి సాగునీరు ఇవ్వలేమని బోర్డు అధికారులు తేల్చేశారు.
జిల్లా వాటా జలాలు ఉన్నా..
జిల్లాలో ఎల్లెల్సీ, కేసీ నీటి వాటా మిగులు ఉన్నా, కాలం చెల్లిన టీబీ డ్యాం 33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లు అమర్చే పనులు చేపట్టడంతో రబీకి సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఎల్లెల్సీ వాటా 24 టీఎంసీలకు గాను 19.019 టీఎంసీలు కేటాయించారు. అక్టోబరు అఖరు వరకు 7.823 టీఎంసీలు వాడుకోగా, నవంబరులో 2.33 టీఎంసీలు, డిసెంబరులో 2.143 టీఎంసీలు అవసరం ఉంది. అంటే.. డిసెంబరు ఆఖరు నాటికి ఎల్లెల్సీ వాటా 6.720 టీఎంసీలు మిగులు ఉంది. అలాగే.. కేసీ నీటి వాటా 10 టీఎంసీలకు గాను 7.925 టీఎంసీలు కేటాయించారు. డిసెంబరులో 1.728 టీఎంసీలు వాడుకుంటే 6.197 టీఎంసీలు మిగులు ఉంటుంది. అనంతపురం జిల్లాకు 1.279 టీఎంసీలు అదనంగా వాడుకున్న నీటిని తీసేసినా డిసెంబరు ఆఖరుకు ఎల్లెల్సీ, కేసీ వాటా 11.638 టీఎంసీలు మిగులు ఉంటుంది. రబీ సాగునీటికి ఇబ్బంది లేకున్నప్పటికి డ్యాం గేట్లు అమర్చే పనుల వల్ల రబీ పంటను త్యాగం చేయక తప్పదని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ క్రస్ట్ లెవల్ దిగువ ఎల్లెల్సీ కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా, కర్ణాటక పరిధిలో 135 కిలో మీటర్లు కాలువ ప్రవహిస్తుండంతో కర్ణాటక ఇండెంట్ లేకుండా మన నీటివాటాను తీసుకున్నా ఎగువన జలచౌర్యం వల్ల ఏపీ సరిహద్దుకు చేరడం కష్టమే అంటున్నారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరాకు టీబీపీ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది.
తాగునీటికి ఇబ్బంది లేదు
తుంగభద్ర డ్యాం కొత్త క్రస్ట్‌గేట్లు అమర్చే పనులు మొదలు పెట్టాలంటే క్రస్ట్ లెవల్ కంటే దిగువకు నీరు నిల్వ ఉండాలి. డిసెంబరు నుంచి పనులు మొదలు పెట్టేందుకు బోర్డు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 10 వరకు సాగునీరు ఇస్తామని కర్ణాటక ఐసీసీ తీర్మానం మేరకు టీబీపీ బోర్డు నీటి విడుదలపై ప్రణాళిక సిద్ధం చేసింది. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- బి. బాలచంద్రారెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, కర్నూలు:
ఏపీ వాటాలో ఆయా కాలువకు కేటాయింపులు, డిసెంబరు ఆఖరుకు వినియోగం, మిగులు (టీఎంసీల్లో)
కాలువ వాటా కేటాయింపు వినియోగం మిగులు
ఎల్లెల్సీ 24.00 19.019 12.299 6.72
కేసీ కెనాల్ 10.00 7.925 1.728 6.197
హెచ్చెల్సీ 32.50 25.755 27.033 1.278 (లోటు)
మొత్తం 66.50 54.90 41.060 11.638
తుది అంచనా 168 టీఎంసీలు రాష్ట్రాల వారిగా కేటాయింపులు (టీఎంసీల్లో)
రాష్ట్రం వాటా కేటాయింపు
కర్ణాటక 138.990 110.143
ఆంధ్రప్రదేశ్ 66.500 52.698
తెలంగాణ 6.510 5.159
మొత్తం 212.000 168.000