ఎగ్‌బాకుతోంది..!
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:42 PM
కోడి గుడ్డు ఽధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
పది రోజుల్లోనే డజనుపై రూ.30 పెరుగుదల
రిటైల్ మార్కెట్లో రూ.10కు చేరిన గుడ్డు ధర
మరింత పెరుగుతాయంటున్న వ్యాపారులు
కొలిమిగుండ్ల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కోడి గుడ్డు ఽధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పది రోజుల వ్యవధిలోనే డజను గుడ్లపై ఏకంగా రూ.30 పెరగడంతో వినియోగదారులు హడలెత్తిపోతున్నారు. ఈనెల ప్రారంభంలో రిటైల్ మార్కెట్లో రూ.6, రూ.6.50 ఉన్న గుడ్డు ధర కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.10కి చేరింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ కోడ్డి గుడ్డు తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటారని ఓవైపు వైద్యులు సూచిస్తుంటే, కోడిగుడ్లు కొనాలంటేనే భయమేస్తోందని ప్రజలు వాపోతున్నారు. చలికాలం కావడం, కార్తీక మాసం ముగియడంతో కొద్ది రోజులుగా మార్కెట్లో కోడి గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. సామాన్య ప్రజలు మొదలుకొని, ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్కరూ, వారంలో ఐదారు రోజులు గుడ్డు తినడానికి ఇష్టపడుతున్నారు. మరోవైపు సాయంత్రం అయితే చాలు పల్లెలూ, పట్టణాలు అన్న తేడా లేకుండా తోపుడుబండ్లపై ఆమ్లెట్లు, న్యూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 1.50లక్షల వరకు కోడిగుడ్లు వినియోగం జరుగుతున్నట్టు వ్యాపార వర్గాల అంచనా. త్వరలో కోడిగుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.