ప్రశాంతంగా జరగాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:30 AM
ప్రతి ఏటా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
బన్నీ ఉత్సవాలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 2న జరిగే ఈ బన్నీ ఉత్సవాలకు సంబంధించి సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీతో పాటు కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, దేవరగట్టు గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఎలాంటి సమస్యలు రాకుండా పండుగలా జరుపుకోవాలని సూచించారు. బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ అవసరమైన ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరుకుగా ఉన్న రోడ్డు పనులు సరి చేయాలని, రోడ్డు చిన్నగా ఉన్నందున లోపలికి వెళ్లేందుకు వీలుగా చిన్నగా ఉండే అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలని, ఎక్సైజ్ పోలీసు శాఖ సమన్వయంతో నాటుసారా, మద్యం నియంత్రించే చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్రలకు రింగులు ఉన్న వాటిని ముందుగానే స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖ సిబ్బందిని ఆదేశించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ గుడి దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాల మల్లేశ్వరస్వామి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్‌లతో పాటు కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.