వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయండి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:25 AM
గర్భిణుల నమోదులో 85 శాతంలోపు పురోగతి చూపిన మండల వైద్యా ధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా డీఎంహెచ్‌వోను ఆదేశించారు.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మాతృ మరణాలు జరగకుండా వైద్య సేవలందించాలి
కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): గర్భిణుల నమోదులో 85 శాతంలోపు పురోగతి చూపిన మండల వైద్యా ధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా డీఎంహెచ్‌వోను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వైద్య ఆరోగ్య అంశాలపై వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన జిల్లా అధికారులు, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ ఆఫీసర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణిలను వంద శాతం పోర్టల్‌లో నమోదు చేసి వారికి సరైన వైద్యసేవలందించి మాతృమరణాలు జరగకుండా చూడాలని అన్నారు. చిప్పగిరి మండలంలో 89 శాతం మాత్రమే గర్భిణిలను రిజిస్టర్ చేశారని, సమస్య ఏమిటని మెడికల్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిం చాలన్న లక్ష్యంతో పని చేస్తోందన్నారు. నవజాత శిశువులను రిజిస్టర్ నమోదు, వైద్యసేవలు అందించడంతో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల న్నారు. ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) సర్వేకు సంబంధించి కూడా జనాభా అంతటికి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని వైద్యధికారులను ఆదేశించారు. సర్వేలో కోసిగి, తుగ్గలి మండలాలు వెనుకబడి ఉన్నాయని, పురోగతి సాధించాలన్నారు. ఎక్కడైనా ఏఎన్‌ఎంలు తక్కువగా ఉంటే డిప్యుటేషన్ చేసి రేషనలె ౖజేషన్ చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎంహెచ్‌వో శాంతికళ, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ సింధు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.