భూ సేకరణకు నిధులు ఇవ్వండి..!
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:13 AM
ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టుల పనులు కాంట్రాక్టు సంస్థలు చేపట్టాలంటే భూ సేకరణ కోసం నిధులు విడుదల చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పనులు తక్షణమే చేపట్టాలి
జీఆర్‌పీ నిర్వహణకు ఐదేళ్లకు నిధులు కేటాయించాలి
పీఏసీ సమావేశంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్
సానుకూలంగా స్పందించిన స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్
కర్నూలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టుల పనులు కాంట్రాక్టు సంస్థలు చేపట్టాలంటే భూ సేకరణ కోసం నిధులు విడుదల చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిలో బుధ, గురువారం రెండు రోజులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన జరిగింది. పీఏసీ సభ్యులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, బూర్ల రామాంజనేయులు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్‌రెడ్డి, నక్క ఆనంద్, కోళ్ల లలితకుమారి, విష్ణుకుమార్‌రాజు సహా జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సీఈ కబీర్‌బాషా హాజరయ్యారు. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టుపై చర్చించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆశయంతో ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాన్ని 2019 జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జీవో ఆర్టీ నం.76 జారీ చేసి, రూ.1,985.42 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆర్డీఎస్ అనకట్ట వద్ద హెడ్ స్లూయిస్, కాలువ నిర్మాణం పనులను మొదలు పెట్టారని, గత వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని గుర్తు చేశారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి తక్షణం పనులు మొదలు పెట్టాలనే ఆదేశాలు ఇచ్చారు. అయితే.. భూ సేకరణ చేయకపోవడంతో పనులు చేయలేని పరిస్థితుల్లో ఉందని, అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే.. గురురాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏటేటా ప్రతిపాదనలు తయారు చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, ఐదేళ్లకు ఒకేసారి డీపీఆర్ తయారు చేసి నిర్వహణ బాధ్యతలు కాంట్రాక్ట్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తాను పత్తిపాడు ఎమ్మెల్యే అయినా.. తన స్వగ్రామం ఆలూరు అని, వేదవతి ప్రాజెక్టు పూర్తయితే ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. తక్షణం నిధులు ఇచ్చి భూసేకరణ చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలనే అభిప్రాయానికి జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ సానుకూలంగా స్పందించారు.