Share News

పన్నుల వసూళ్లపై చిత్తశుద్ధి లేదా?

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:13 PM

మొండిబకాయి పన్నులను వసూలు చేయడంలో కొందరు అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పన్నుల వసూళ్లపై చిత్తశుద్ధి లేదా?
నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌

ట్యాప్‌ ఇన్‌స్పెక్టర్లు ఏమి చేస్తున్నారు

నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మొండిబకాయి పన్నులను వసూలు చేయడంలో కొందరు అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిలో మార్పు రాకపోతే సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బుధవారం నగరంలోని ఎస్‌బీఐ కాలనీలో ఆస్తి, కుళాయి పన్నుల వసూళ్లపై అధికారులతో కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌ పరిధిలో రూ.100 కోట్ల పన్ను బకాయిలు, మున్సిపల్‌ దుకాణాల అద్దెలు, పన్ను మదింపు స్థిరీకరణ పన్నులు ఎప్పుడు వసూలు చేస్తారని ప్రశ్నించారు. నగర పాలకలో ఏమి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏ వార్డు సచివాలయ పరిధిలో ఎంత బకాయిలు ఉన్నాయో కూడా తెలియదా? అని అడ్మిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీటి పన్ను వసూలపై ఇంజనీరింగ్‌ అధికారులకు అవగాహన ఉందా? అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కుళాయి కనెక్షన్లకు మీటర్లను ఎందుకు కనెక్ట్‌ చేయలేదని, అసలు ట్యాప్‌ ఇన్స్‌పెక్టర్లు ఏమి చేస్తున్నారని ఇంజనీరిగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ఉంటూ మొండి బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. పనితీరు బాగా లేని కార్యదర్శులకు మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు ఫైనాన్షియల్‌ లాస్‌ కింద వారి ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తామన్నారు. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో తాగునీటి కుళాయి పన్నులను 95 శాతం వసూలు చేసిన 115వ సచివాలయ అమ్యూనిటీ కార్యదర్శిని కమిషనర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సతీ్‌షకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కె.విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌వోలు జునైద్‌, వాజిద్‌, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:13 PM