ముకుందా.. ముకుందా...
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:10 AM
జిల్లా వ్యాప్తంగా శనివారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా సాగాయి. ఉట్టికొట్టి చిన్నాపెద్ద సందడి చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కృష్ణ, గోపిక వేషధారణలో చిన్నారులు
కర్నూలు కల్చరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా సాగాయి. ఉట్టికొట్టి చిన్నాపెద్ద సందడి చేశారు. పలుచోట్ల చిన్నారులు.. గోపాలుడు, గోపికమ్మల వేషధారణలతో ఆకట్టుకున్నారు. కర్నూలు నగరంలోని ఇస్కాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమతత్వఆన్ని పంచిన శ్రీకృష్ణుడి కృపాకటాక్షాలు ఉండేలా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు నగరంలోని నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో, నగరంలో కిడ్స్ వరల్డ్ సమీపంలోని గో సంరక్షణశాలలో, ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) మందిరం ఆధ్వర్యంలో నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవీ ఫంక్షన్ హాలులో, బి.క్యాంపులోని విజ్ఞాన మందిరం, గోదా గోకుల క్షేత్రంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని రుక్మిణీ సమేత శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. యాదవ కుల బంధువుల ఆధ్వర్యంలో, శ్రీకృష్ణ జయంతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలో కలెక్టరేట్ నుంచీ శ్రీకృష్ణ మందిరం వరకు శ్రీకృష్ణ భగవానుడి విగ్రహంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో శనివారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవీ ఫంక్షన్‌హాలులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేశారు. గో సంరక్షణ శాలలో ఉదయం శ్రీకృష్ణ విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.