Share News

కోల్డ్‌ స్టోరేజీకి మోక్షమెన్నడో?

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:17 AM

కోల్డ్‌ స్టోరేజీకి మోక్షమెన్నడో?

కోల్డ్‌ స్టోరేజీకి మోక్షమెన్నడో?
కర్నూలు మార్కెట్‌ యార్డులో రూ.2 కోట్లు ఖర్చు చేసి అసంపూర్తిగా వదిలేసిన ఉల్లి శీతల గిడ్డంగులు

రూ.5 కోట్లతో ఉల్లి శీతల గిడ్డంగి నిర్మాణానికి శ్రీకారం

సామర్థ్యం 5 లక్షల మెట్రిక్‌ టన్నులు

వైసీపీ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన వైనం

నిర్మాణం పూర్తయి ఉంటే ఉల్లి రైతులకు వరం

ఉల్లి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధరలు పతనమై పంట దిగుబడులు రోడ్లపై పారబోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కష్టాలు తీరాలంటే ధర లేనప్పుడు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయాలి. ధర ఉన్నప్పుడు అమ్ముకొని రైతు లాభ పడాలనే సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంలో శీతల గిడ్డంగి (కోల్డ్‌ స్టోరేజీ) నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఎఫ్‌) నిధులు రూ.5 కోట్లు ఇచ్చింది. సగం పనులు పూర్తి అయ్యాయి. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఐదేళ్లు అసంపూర్తిగా వదిలేశారు. గత పాలకుల నిర్లక్ష్యం ఉల్లి రైతులకు శాపమై వెంటాడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పనులు చేపట్టలేదు. ఆనాడే శీతల గిడ్డంగి నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఉల్లి పంట అమ్ముకోవడానికి రైతులకు ఇన్నీ కష్టాలు వచ్చేవా..? కోల్డ్‌స్టోరేజ్‌ గోదాములో నిల్వ చేసి ధర వచ్చినప్పుడే అమ్ముకునే అకాశం ఉండేది. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులు రోజువారి (రెగ్యులర్‌)గా పత్తి, ఉల్లి, మిరప, వేరుశనగ, వాము, కంది.. వంటి పంట ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పత్తికొండ మార్కెట్‌ యార్డులో సీజన్‌లో టమోటా క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. ఆలూరు, మంత్రాలయం (కోసిగి), కోడుమూరు మార్కెట్‌లో పంట ఉత్పత్తులు విక్రయాలు జరగడం లేదు. ఆయా మార్కెట్లలో ప్రతి ఏటా సరాసరి రూ.3,500 కోట్ల నుంచి రూ.4,500 వేల కోట్ల వరకు విలువైన పంట ఉత్పత్తులు రైతులు అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఒక శాతం సెస్సు రూపంలో ఈ ఏడాది రూ.35-45 కోట్లు ఆదాయం వస్తోంది. కర్నూలు మార్కెట్‌ యార్డు ఉల్లి క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. అయితే.. రెండేళ్లకు ఒకసారి ధరలు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2022, 2023లో ఽఉల్లి ధరలు పడిపోయాయి. గత ఏడాది క్వింటా రూ.5 వేలకు పైగా పలికింది. ఈ ఏడాది పూర్తిగా పతనమై రూ.450 నుంచి రూ.500కు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా ఉల్లి రైతులు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కష్టాలు తీరాలంటే పంట నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డుంగులు ఎంతో అవసరం.

రూ.5 కోట్లు.. 5 లక్షల టన్నుల సామర్థ్యం

కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఏటా రూ.850-900 కోట్లు విలువైన వ్యవసాయ పంట దిగుబడులు రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొస్తున్నారు. రూ.8.5 కోట్లు వరకు సెస్సు రూపంలో మార్కెట్‌కు ఆదాయం వస్తుంది. అందులో ఉల్లి విక్రయాలు ద్వారానే ఏడాదికి రూ.1.50-2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. రాయలసీమ జిల్లాల్లో ఏకైక ఉల్లి మార్కెట్‌ ఇది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, సరిహద్దున తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఉల్లి దిగుబడులు తీసుకొస్తున్నారు. గిట్టుబాటు ధర లేక.. లారీ బాడుగులు కూడా గిట్టుబాటు కాక రైతులు ఉల్లిని రోడ్లపై పారబోసిన వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. మద్దతు ధర లేనప్పుడు ఉల్లి నిల్వ చేసి.. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 2016-17లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుబడులు నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులు (కోల్డ్‌స్టోరేజ్‌) నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ (ఆర్డీఎఫ్‌) నిధులు రూ.5 కోట్లు మంజూరు చేసింది. రూ.2.40 కోట్లు ఖర్చు చేసి సగానికి పైగా పనులు పూర్తి చేశారు. గోడలు, శీతలీకకరణ పనులు చేపడితే సరిపోతుంది. అదే జరిగితే ఉల్లి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పనులు పూర్తేయ్యే దశలో ఉండగా, 2019లో టీడీపీ ప్రభుత్వం స్థానంలో వైసీపీ ప్రభుత్వం కొలుదీరింది. ఈ పనులు చేస్తే ఎక్కడ చంద్రబాబుకు రైతుల్లో మంచి పేరు వస్తుందో..? అని జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు నెలల క్రితం 2025-26 ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేసేందుకు రూ.5 కోట్లు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపించారు. నిధులు వస్తాయా..? పనులు మొదలు పెడుతారా..? అన్నది ప్రశ్నార్థకమే.

శీతల గిడ్డంగితో తీరుతున్న రైతుల కష్టాలు

ఉల్లికి కుళ్లిపోయే గుణం ఎక్కువ. దీంతో ఎప్పటికప్పుడు గ్రేడింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చే ఉల్లిని అదే రోజు కొనుగోలు చేసి వ్యాపారులు బహిరంగ వ్యాణిజ్య మార్కెట్లకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. రెండు మూడు రోజులు ఆగిపోతే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో ఖరీ్‌ఫలో సాగు చసే ఉల్లి పంట ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొతకు వస్తుంది. జిల్లాలో దాదాపు 31 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు సరాసరి 80 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా. ఈ లెక్కన ఏడాదికి 24.80 లక్షల క్వింటాళ్లు (2.48 లక్షల టన్నులు) ఉల్లి దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా. కర్నూలు మార్కెట్‌ యార్డు ఉల్లి లైసెన్సుడ్‌ వ్యాపారుల 15 మందికి మించి వ్యాపారం (ట్రేడింగ్‌) చేస్తున్నారు. రోజుకు సగటున 8-10 వేల క్వింటాళ్లకు మించి కోనుగోలు చేసే సామర్థ్యం లేదు. దీనికి తోడు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రైతులు ఉల్లి తీసుకొస్తున్నారు. ఆ స్థాయిలో వ్యాపారులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. ఫలితంగా ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారు. అదే శీతల గిడ్డంగులు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఓ వ్యాపారి పేర్కొనడం కొసమెరుపు. కర్నూలు ఉల్లి కోల్‌కతా, తమిళనాడు, కేరళ, గుజరాత్‌ ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసేవారు. ఎగుమతి ఆపేయడంతో ధరలు పడిపోయి రైతులకు నష్టం తప్పడం లేదు. ధరల విపత్తుల నుంచి ఉల్లి రైతులు గట్టేక్కాలంటే అసంపూర్తిగా ఆపేసిన శీతల గిడ్డుంగులు తక్షణమే పూర్తి చేసే వచ్చే ఏడాది నుంచైనా రైతులకు వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసంపూర్తిగా జంబో షెడ్డు

కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగ, వాము, కంది, పప్పు శనగ.. వంటి పంట దిగుబడులు క్రయ విక్రయాల కోసం మార్కెట్‌ ఆఫీసుకు ఎదురుగానే రూ.2.50 కోట్లతో జంబో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 80 శాతం పూర్తి చేసినా డ్రైన్లు, సిమెంట్‌ ప్లాస్టింగ్‌.. వంటి పనులు ఆసంపూర్తిగా ఉన్నాయి.

ప్రతిపాదనలు పంపించాం

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి శీతల గిడ్డంగులు అసంపూర్తిగా ఉన్న మాట నిజమే. ప్రభుత్వానికి నివేదిక పంపించాం. బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేయడానికి రూ.5 కోట్లు నిధులు అవసరం ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు మొదలు పెడుతాం.

జయలక్ష్మి, స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి, కర్నూలు మార్కెట్‌ యార్డు

Updated Date - Sep 08 , 2025 | 01:17 AM