3,850 క్యూసెక్కులు సాధ్యమేనా..!
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:04 AM
హంద్రీ నీవా ద్వారా 3,850 క్యూసెక్కుల నీరు తీసుకోవాలి..
రూ.1,970 కోట్లతో హంద్రీ నీవా విస్తరణ పనులు
మట్టి పనులు 90 శాతానికి పైగా పూర్తి
అసంపూర్తిగా లైనింగ్ పనులు
17న కృష్ణా జలాలు ఎత్తిపోతను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
హంద్రీ నీవా ద్వారా 3,850 క్యూసెక్కుల నీరు తీసుకోవాలి.. కుప్పం బ్రాంచి కాలువకు కృష్ణా జలాలు మళ్లించాలి..! ఇది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతిష్టాత్మకంగా రూ.2,640 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. మట్టి పనులు 90 శాతానికి పైగా పూర్తి చేశారు. అయితే సీసీ లైనింగ్, షాట్ క్రెటింగ్ పనులు 40 శాతం కూడా పూర్తవ్వలేదు. రోడ్డు క్రాసింగ్ బ్రిడ్జీలు, స్ట్రక్చర్ల వద్ద లైనింగ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 17న సీఎం చంద్రబాబు హంద్రీ నీవాకు కృష్ణా జలాల ఎత్తిపోతను ప్రారంభించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయిలో నీరు తీసుకోవా లని ప్రభుత్వం చెబుతోంది. అది సాధ్యమేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఎగువన 40 టీఎంసీలు కృష్ణాజలాలు ఎత్తిపోసి రాయలసీమ జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. 1989లో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే.. 2004-05 నుంచి పనులు వేగంగా జరిగాయి. 8 ఏళ్లకు ఉమ్మడి కర్నూలు జిల్లా మాల్యాల లిఫ్ట్ నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు ఫేజ్-1 కింద చేపట్టిన 0/00 నుంచి 216.30 కిలో మీటర్ల వరకు ప్రధాన కాలువ, ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి 2012 నవంబరులో ట్రయల్ రన్ విజయవంతం చేశారు. అయితే.. పదేళ్లుగా 2 వేల క్యూసెక్కులకు మించి నీరు తీసుకోలేని పరిస్థితి ఉంది. 2017-18లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం 3,850 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా రూ.1,030 కోట్లతో కాలువ విస్తరణ పనులు చేపట్టారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విస్తరణ అటకెక్కింది. ఐదేళ్లలో గంపెడు మట్టి కూడా తీయకపోగా, రూ.6,500 కోట్లలో 6 వేల క్యూసెక్కులకు విస్తరిస్తామంటూ మాయ మాటలతో మభ్యపెట్టారే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత కాలమైనా ప్రధానమైన పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 3,850 క్యూసెక్కులు సాధ్యమేనా..! అనే ప్రశ్న కూడా ఉంది. అయితే పనులను వేగవంతం చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా విస్తరణ పనులు
హంద్రీనీవా కాలువ ద్వారా పూర్తిస్థాయి ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు కృష్ణా జలాలు ఎత్తిపోసి కుప్పం బ్రాంచి కెనాల్‌కు మళ్లించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విస్తరణకు శ్రీకారం చుట్టింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల ప్రధాన ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురం జల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువ విస్తరణ బ్యాలెన్స్ పనులు ఫేజ్-1 కింద రూ.695 కోట్లతో చేపట్టారు. ప్యాకేజీ-1 కింద మాల్యాల ఎత్తిపోతల పథకం (పీహెచ్-1) అప్రోచ్ చానల్ సహా 0/0 నుంచి 88 కిలో మీటర్లు వరకు మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. ప్యాకేజీ-2 కింద 88 నుంచి 216.30 కి.మీల వరకు వీపీఆర్-డీఎస్‌ఆర్ జాయింట్ వెంచర్ కింద చేపట్టారు. ఫేజ్-2లో భాగంగా 216.300 కి.మీటర్ల నుంచి 340.500 కిలో మీటర్ల వరకు ప్యాకేజీ-1,2,3 కింద రూ.456.54 కోట్లతో విశాఖకు చెందిన ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - ఎల్‌సీసీ జాయింట్ వెంచర్, 340 కి.మీల నుంచి 400.500 కి.మీల వరకు ప్యాకేజ్-4,5 కింద రూ.352.40 కోట్లతో కర్ణాటకకు చెందిన బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులు చేపట్టింది. పుంగనూరు బ్రాంచి కెనాల్ 0/00 కి.మీల నుంచి 75.050 కిలో మీటర్ల వరకు లైనింగ్ పనులు ప్యాకేజీ-6,7 కింద రూ.266.23 కోట్లతో ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రాటెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. అలాగే.. కుప్పం బ్రాంచి కెనాల్ లైనింగ్ పనులు రూ.200 కోట్లతో చేపట్టారు. అంటే.. అగ్రిమెంట్ విలువ ప్రకారం రూ.1,970 కోట్లతో నంద్యాల జిల్లా మాల్యాల నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు హంద్రీ నీవా విస్తరణలో భాగంగా మట్టి, సీసీ లైనింగ్, షాట్ క్రెటింగ్ పనులు చేపట్టారు.
పూర్తికాని సీసీ లైనింగ్
హంద్రీ నీవా 0/0 నుంచి 400.500 కిలో మీటర్లు వరకు ప్రధాన కాలువ, 0/0 నుంచి 75.050 కిలో మీటర్లు పుంగనూరు బ్రాంచి కెనాల్ విస్తరణ, సీసీ లైనింగ్ పనులు రూ.1,770.70 కోట్లతో చేపట్టారు. మట్టి పనులు 1.89 కోట్లు క్యూబిక్ మీటర్లు మట్టి పనులకు గాను 1.68 - 1.70 కోట్లు క్యూబిక్ మీటర్లు (90 శాతం), సీసీ లైనింగ్, షాట్ క్రెటింగ్ పనులు 80.61 లక్షల స్క్వయర్ మీటర్లకు గాను 30-32 లక్షల స్క్వయర్ మీటర్లు (40 శాతం) పూర్తి చేసినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. ఫేజ్-1 కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో మేజర్‌గా మట్టి పనులు చేస్తే, ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో లైనింగ్ పనులు చేపట్టారు. ఫేజ్-1 పరిధిలో 90 శాతం మట్టి పనులు, 17-18 శాతం లైనింగ్ పనులు, ఫేజ్-2లో 87 శాతం మట్టి, 43-45 శాతం సీసీ లైనింగ్ పనులు పూర్తి చేశారు. ముఖ్యంగా సింగిల్ లైన్ రోడ్ బిడ్జి (ఎస్‌ఎల్‌ఆర్‌బీ), అండర్ టన్నెల్ (యుటీ), క్రాస్ మ్యాసరి క్రాస్ డ్రైనేజీ (సీఎంసీడీ).. వంటి నిర్మాణాలు (స్ట్రక్చర్స్) వద్ద రెండు వైపులు సుమారు 50 మీటర్ల వరకు లైనింగ్ తప్పకుండా చేయాల్సి ఉందని ఇంజనీర్లు అంటున్నారు. జరిగిన పనులు పరిశీలిస్తే.. కీలకమైన స్ట్రక్చర్స్ వద్ద 75-80 శాతం లైనింగ్ పనులు చేయలేదు. ఆ ప్రాంతంలో వెలాసిటీ (నీటి ప్రవాహ వేగం) తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం లక్ష్యం మేరకు 3,850 క్యూసెక్కులు తీసుకోవడం సాధ్యమేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు పూర్తి స్థాయి 3,850 క్యూసెక్కులు ఎత్తిపోస్తే కాలువ గట్లకు ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. వివిధ నిర్మాణాల వద్ద సీసీ లైనింగ్ చేస్తే 3 వేల నుంచి 3,500 క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. వాస్తవంగా జూన్ ఆఖరిలోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా కాగా.. వివిధ కారణాల వల్ల ఈ నెల 25 వరకు పొడిగించారు.
17న సీఎం చంద్రబాబు రాక
శ్రీశైలం ఎగువ నుంచి హంద్రీ నీవా కాలువకు కృష్ణా జలాలు ఎత్తిపోసేందుకు ఈ నెల 17 సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. డిల్లీ పర్యటన తరువాత చంద్రబాబు జిల్లాకు రానున్నారు. విస్తరణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు మూడు నెలల్లో 90 శాతం మట్టి పనులు పూర్తి చేయడం జలవనరుల శాఖలో ఒక రికార్డని ఇంజనీర్లు పేర్కొన్నారు. పనులు మొదలు పెట్టిన తరువాత సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థా యిలో పర్యవేక్షించడమే కాకుండా వారం వారం సమీక్షించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు.
పూర్తిస్థాయిలో నీరు ఎత్తిపోస్తాం
హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులు 90 శాతానికిపైగా పూర్తి చేశాం. లైనింగ్ పనులు కొంత చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో 3,850 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు సన్నాహాలు పూర్తి చేశాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యం మేరకు నీటిని లిఫ్ట్ చేస్తాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పనులు చేపట్టింది. తక్కువ సమయంలో విస్తరణ పనులు పూర్తి చేయడం ఇంజనీరింగ్ చరిత్రలో ఒక రికార్డు. - పాండురంగయ్య, ఎస్‌ఈ, హంద్రీ నీవా సర్కిల్-1, కర్నూలు:
ప్యాకేజీల వారిగా పురోగతి (మట్టి పనులు క్యూబిక్ మీటర్లు, లైనింగ్ స్వ్కయర్ మీటర్లు, లక్షల్లో)
ప్యాకేజీలు మట్టి పనులు లైనింగ్ పనులు
లక్ష్యం చేసింది శాతం లక్ష్యం చేసింది శాతం
ఫేజ్-1: అప్రోచ్ ఛానల్, 0/0 నుంచి 216.300 కిలో మీటర్లు
ప్యాకేజీ-1 37.79 32.90 87.00 5.61 2.10 37.40
ప్యాకేజీ-2 84.97 76.88 90.51 14.13 1.25 8.90
మొత్తం 122.76 109.78 89.42 19.74 3.35 16.97
ఫేజ్-2: 216.300 నుంచి 400.500 కి.మీలు, పుంగనూరు బ్రాంచి కెనాల్ 0/0 - 75.050 కి.మీలు
ప్యాకేజీ-1 6.87 7.95 115.72 14.08 7.28 51.68
ప్యాకేజీ-2 4.45 4.92 110.60 7.94 4.72 59.44
ప్యాకేజీ-3 6.28 5.97 95.06 9.66 5.65 58.40
ప్యాకేజీ-4 7.28 7.98 109.68 3.87 1.25 32.40
ప్యాకేజీ-5 14.20 10.95 77.10 10.14 2.79 27.50
ప్యాకేజీ-6 9.08 6.26 69.00 4.84 1.49 30.72
ప్యాకేజీ-7 18.18 14.12 77.70 10.34 3.48 33.62
మొత్తం 66.34 58.15 87.65 60.87 26.66 43.79
మొత్తం 189.10 167.93 88.80 80.61 30.01 37.22