Share News

సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు

ABN , Publish Date - Jul 29 , 2025 | 10:36 PM

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు విరివిగా పరిశ్రమలు స్థాపన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ వెల్లడించారు.

సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు
మాట్లాడుతున్న మాధవ్‌

కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు విరివిగా పరిశ్రమలు స్థాపన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏ.క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి, రాజ్‌విహార్‌లోని స్వామివివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా మౌర్యఇన్‌ హోటల్‌లో బీజేపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ అమలు పరుస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ రాయలసీమలో రత్నాలు పోయి రాళ్లసీమగా మారిందన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయినప్పటికీ అభివృద్ధి పెద్దగా జరగలేదన్నారు. కర్నూలు రాజధాని హైదరాబాదుకు, ఆ తర్వాత అమరావతికి వెళ్లిందన్నారు. దీంతో కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తుంగభద్ర, కృష్ణానది జలాలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారుం. ఈ ప్రాంత వాసులకు తాగేందుకు చుక్కనీరు కరువైందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు లిఫ్టు ఇరిగేషన్‌లు మంజూరు చేయించి వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. ప్రాజెక్టుల ఏర్పాటు, నిధుల కోసం పోరాటాలు చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయనీ, పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిని వెలికి తీయాలన్నారు. గతంలో దేవాలయాలను ధ్వంసం చేశారని, పోరాటాలు చేసినా నిందితులను జైళ్లకు పంపలేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వారిని జైళ్లలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ బీజేపీకి బలం లేదని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుండేది లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ నేరుగా ఆకాశం నుంచి వచ్చిన నాయకుడు కాదని, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు అన్నారు. ఎన్నో కష్టాలు, నష్టాలకోర్చి రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయనీ, సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, సీనియర్‌ నాయకులు చంద్రమౌలి, రామస్వామి మాజీ ఎమ్మెల్యే మురళికృష్ణ, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 10:36 PM