పది వేల ఎకరాలకు సాగునీరు
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:31 PM
గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీ సీజన్‌లో పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.
రైతులను ఆదుకునేందుకు చర్యలు
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీ సీజన్‌లో పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, జీఆర్‌పీ ఈఈ మల్లికార్జున, ఎంఐ ఈఈ వెంకటరాముడు, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజవర్గంలో ఎల్లెల్సీ, జీడీపీ(గాజులదిన్నె ప్రాజెక్టు), జీఆర్‌పీ(గురు రాఘవేంద్ర ప్రాజెక్టు)లో సాగునీటి, పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో రైతులకు రబీ సీజన్‌లో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల డిసెంబర్ 15 వరకు మాత్రమే అంటున్నారని, నీటి విడుదలపై నవంబర్ 7న జరిగే సమావేశంలో పూర్తిస్థాయిలో నీటి విడులపై స్పష్టత వస్తుందన్నారు. నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో పాక్షికంగా రైతులు నష్టపోయారన్నారు. గోనెగండ్ల మండలంలో నష్టపోయిన 40మంది రైతులకు రానున్న రబీలో పంట సాగుచేసుకునేందుకు ఒక కిట్టు మినుములు అందజే స్తామన్నారు. ఎమ్మిగనూరుకి తాగునీటి అందించే గుడికల్ చెరువులో నీటి నిలువ పెంచేందుకు సర్వే చేయించామన్నా రు. ఎమ్మిగనూరు, కోసి గి రోడ్డుకు నిధులు మం జూరయ్యాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎల్లెల్సీ డీఈ విద్యాసాగర్, ఏడీఏ మహ్మద్ ఖాద్రీ, ఏవో శివశంకర్, టీడీపీ ఎమ్మిగనూరు, నందవరం మండలాల నాయకులు కాశీంవలి, రైస్‌మిల్లు నారాయణరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నరసింహులు, మాచాని మహేష్, తిమ్మాపురం రంగన్న, ఉరుకుందు పాల్గొన్నారు.
ఆర్డీఎస్‌కు పునర్జీవనం
కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఆర్డీఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు. కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుకు ఆర్డీఎస్‌కు పునర్జీవనం ఇస్తున్నారన్నారు. ప్రజల జీవనాడి అయిన ఆర్డీఎస్ ఏర్పాటుకు కేబినేట్‌లో ఆమోదం తెలిపారన్నారు. అందులో భాగంగానే భూ సేకరణ కోసం రూ.150 కోట్లు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. త్వరలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు(జీఆర్పీ) మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.