Share News

సాగునీటి నిపుణుడు సుబ్బరాయుడు మృతి

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:33 PM

రాయలసీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు(80) అనారోగ్యంతో ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస వీడారు.

సాగునీటి నిపుణుడు సుబ్బరాయుడు మృతి
సుబ్బరాయుడు (ఫైల్‌)

వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టుల రూపశిల్పి

సిద్ధేశ్వరం ప్రాజెక్టు కోసం అలుపెరగని పోరాటం

తుదిశ్వాస వీడేవరకు సీమ ప్రాజెక్టుల కోసం పరితపించిన వ్యక్తి

అనారోగ్యంతో మరణం.. పలువురి ప్రగాఢ సంతాపం

కర్నూలు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాయలసీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు(80) అనారోగ్యంతో ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస వీడారు. ఆయన మరణంతో సీమ ఓ జలవనరుల నిపుణుడిని కోల్పోయింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా పలువురు వామపక్ష నాయకులు, ఇంజనీర్లు, రాయలసీమ సాగునీటి సాధన సమితి, సీమ మేధావుల ఫోరం నాయకులు ఆయన భౌతికాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలి పారు. వృధాగా కడలి పాలవుతున్న కృష్ణా, తుంగభద్ర వరద రాయలసీమ కరువు పల్లెలకు మళ్లించి మెట్ట చేలను సస్యశామలం చేయాలని తుదిశ్వాస వీడేవరకు తపించిన వ్యక్తి సుబ్బరాయుడు. జలవనరుల శాఖలో ఏఈగా విధుల్లో చేరిన ఆయన తెలుగుగంగ, ఎస్సార్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టుల్లో ఏఈఈ, డీఈఈ, ఈఈగా పని చేసి 2005లో పదవి విరమణ పొందారు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలసి విరామ జీవితం గడపలేదు. సముద్రం పాలవుతున్న తుంగభద్ర జలాలు రాయలసీమ ప్రాంతానికి మళ్లిస్తే కరువు, వలసలు నివారించవచ్చని ప్రభుత్వానికి పలు నివేదికలు పంపించారు. వేదావతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కర్నూలు పశ్చిమ ప్రాంతం సహా రాయలసీమ సస్యశామలం అవుతుందని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వాలకు పంపించారు. ఆయన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం డీపీఆర్‌ తయారు చేయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు 2019 జనవరిలో నాటి సీఎం చంద్రబాబు రూ.6వేల కోట్లు మంజూరు చేశారు.

సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేస్తేనే..

సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేస్తేనే సీమ పచ్చగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడమే కాదు. సీమ సాగునీటి నిపుణులను మేల్కొలిపి సిద్దేశ్వరం అలుగు కోసం పోరాటం చేసిన వారిలో ఒకడిగా నిలిచారు. ఆ క్రమంలో శ్రీశైలం ఎగునవ కృష్ణా నదిపై సిద్దేశ్వరం అలుగు నిర్మించే ప్రదేశాన్ని సీమ సాగునీటి నిపుణులతో కలసి పరిశీలించేందుకు వెళ్లిన సుబ్బరాయుడు రాళ్లు దాటతుండగా కాలికి పదునైన రాయి తగిలి రక్తగాయమైంది. ఆ గాయం పెద్దదై చివరికి కాలు తీసేయాల్సి వచ్చింది. కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకొని సీమ ప్రాజెక్టుల కోసం నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. చనిపోవడానికి నాలుగైదు రోజులు ముందు కూడా గుండ్రేవుల జలాశయం 40 టీఎంసీల సామర్థ్యానికి పెంచితే కలిగే జల ప్రయోజనాలు తదితర అంశాలపై నిపుణులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమ య్యారు. అంతులో ఆరోగ్యం బాగలేకపోడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, కోలుకోలేక మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 6న సీమ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సాగునీటి నిపుణులు టి.లక్ష్మీనారయణ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీప్రసాద్‌, నల్లబోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, బోజ్జ ధశరథరామిరెడ్డి తదితరులు సుబ్బరాయుడును కలసి సీమ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ రోజు ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లపోవడం సీమకు తీరని అన్యాయమని టి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:33 PM