అసంబద్ధ విభజన
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:26 PM
అసంబద్ధ విభజన
రెండు మండలాలుగా ఆదోని.. కొత్తగా పెద్దహరివాణం
పలు గ్రామాలకు 25-35 కిలోమీటర్ల దూరం మండల కేంద్రం
ఆదోనిలోనే ఉంచాలంటూ ప్రజాందోళన
ఆదోని జిల్లా కోసం కొనసాగుతున్న ఉద్యమాలు
జిల్లాలో అతిపెద్ద మండలం ఆదోని. నియోజకవర్గంలోని మొత్తం గ్రామాలు ఒకే మండలంలో ఉండడంతో నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది. దీంతో అభివృద్ధి అందని ద్రాక్షగా మారుతోంది. ఆదోనిని నాలుగు మండలాలుగా విభజించాలని ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదోని నుంచి విభజించి పెద్దహరివాణం కేంద్రంగా 17 గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదోని జిల్లా సహా నాలుగు మండలాలుగా విభజించాలని ఆందోళన చేపట్టిన ప్రజలే.. ‘పెద్దహరివాణం వద్దు.. ఆదోనిలోనే కొనసాగించాలి’ అంటూ రోడ్డెక్కుతున్నారు. కొత్త మండల కేంద్రానికి ఆ గ్రామాలకు మధ్య దూరం 25-35 కిలోమీటర్లకు పైగా ఉండటమే ఇందుకు కారణం. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల అభిప్రాయం తీసుకోకుండా అసంబద్ధంగా విభజన చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆదోని మండల పరిధిలో 40 పంచాయతీలు, 48 గ్రామాలు ఉన్నాయి. మండల మొత్తం జనాభా 2.15 లక్షలు. జిల్లాలోనే అతిపెద్ద మండలం ఇది. గతంలో ఆదోని మున్సిపాలిటీ, ఆదోని, కౌతాళం మండలాలు కలిసి ఆదోని అసెంబ్లీ నియోజవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కౌతాళం మండలాన్ని మంత్రాలయం నియోజకవర్గంలో కలిపారు. ఆదోని అర్బన్, రూరల్ మండలం కలిపి నియోజకవర్గంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండలాల వారీగా వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయింపులు చేస్తే ఆదోని నియోజకవర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. దీంతో అతిపెద్ద మండలమైన ఆదోని మండలాన్ని ఆదోని అర్బన్, ఆదోని రూరల్, పెద్దహరివాణం, పెద్దతుంబళం మండలాలుగా విభజించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. మంత్రివర్గ ఉప సంఘానికి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఉప సంఘం ఆదోనిని రెండు మండలాలుగా విభజించి పెద్దహరివాణం కేంద్రంగా 17 గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధరంగా గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విభజనపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా రాత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ రావడంతో నిరసనలు వెల్లువెత్తాయి.
పెద్దహరివాణం మండలంలో ఉంచిన గ్రామాలకు ప్రస్తుతం మండలం ఆదోని, పెద్దహరివాణం మధ్య దూరం. కిలోమీటర్లలో..
గ్రామం ఆదోని పెద్దహరివాణం
గణేకల్లు 14 35
ఢాణాపురం 07 30
చాగి 12 35
నారాయణపురం 11 34
నాగనాథనహల్లి 14 37
బస్సాపురం 05 28
కడితోట 07 28
జి. హోసల్లి 11 31
హనవాల్ 15 30
మదిరె 05 18
చిన్నహరివాణం 09 16
చిన్నగోనేహాల్ 10 17
బలదూరు 23 12
యడవల్లి 27 04
సంతేకూడ్లూరు 15 07
పెద్దహవాణం 23 --
వి. కొండాపురం 02 23
అడ్డగోలుగా ఆదోని విభజన
ఆదోని మండలం నైసర్గిక స్వరూపం పరిశీలిస్తే.. ఆదోని కేంద్రం నుంచి తూర్పు వైపున ఆదోని-కర్నూలు వయా ఎమ్మిగనూరు, ఆదోని-గుత్తి వయా పత్తికొండ ప్రధాన రోడ్లు, పడమర వైపున ఆదోని-సిరుగుప్ప వయా పెద్దహరివాణం ప్రధాన రోడ్డు, ఉత్తరం వైపున ఆదోని-రాయచూరు వయా పెద్దతుంబళం ప్రధాన రోడ్డు, దక్షిణం వైపున ఆదోని-బళ్లారి వయా ఆలూరు ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ ఐదు రోడ్లకు 2-15 కిలోమీటర్లు దూరంలోనే గ్రామాలు ఉన్నాయి. పెద్దహరివాణం, యడవల్లి, బలదూరు గ్రామాలు మాత్రమే 23-27 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. నాలుగు మండలాలుగా విభజిస్తే ఆదోని అర్భన్ మినహా మిగిలిన మూడు మండలాలకు ఒక్కో మండలానికి 15 గ్రామాలు వస్తాయి. పెద్దహరివాణంకు 10-12 కిలోమీటర్లు చుట్టూ ఉన్న ఆదోని, హోళుగంద మండలాలలోని గ్రామాలు కలిపి పెద్దహరివారం మండలం, పెద్దతుంబళం చుట్టూ 10-12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆదోని, పెద్దకడబూరు మండలాల్లోని గ్రామాలను కలుపుతూ పెద్దతుంబళం మండలంగా, మిగిలిన గ్రామాలు ఆదోని మండలంలోనే ఉంచి విభజన చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఇందుకు విరుద్ధంగా కొత్తగా పెద్దహరివాణం మండలం ఒక్కటే ఏర్పాటు చేయడం. ఆ మండలంలో 25-35 కిలో మీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు కలపడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొత్తగా మండలం వచ్చిందనే సంతోషం కూడా లేకుండా పోయింది.
ఆదోని జిల్లా కోసం ఉద్యమాలు ఉధృతం
ఆదోని జిల్లా సాధన ఉద్యమం ఉధృతం అవుతోంది. ఆదోని పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 19వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని పట్టణంలోని కోట్ల కూడలిలో వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, విద్యార్థులు రిలే దీక్షలు మద్దతు పలికారు. పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గ పల్లెలు సమాగ్రాభివృద్ది చెందాలంటే ఆదోని జిల్లా తోనే సాధ్యమని జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా ఆదోని డివిజన్ నిర్లక్ష్యానికి గురి అవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తే ఆ సంఘానికి నేతృత్వం వహిస్తున్న మంత్రులు కనీసం ఇటువైపు కూడా రాకుండా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రజలను మోసం చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. తమ మనోభావాలను ఆకాంక్షను గౌరవించకపోవడంపై త్వరలోనే గుణపాఠం చెప్తామన్నారు. ఇదిలా ఉండగా మంత్రాలయంలో నియోజకవర్గంలోని ఆదోని జిల్లాకోసం పో రాటాలు కొనసాగాయి. విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులతో పాటు వైసీపీ శ్రేణులు నిరసనలకు మద్దతు పలికాయి. మంత్రాలయంలోని రాఘవేంద్ర సర్కిల్‌లో నిరసనకారులు మానవహారంగా ఏర్పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
పెద్దహరివాణం మాకొద్దు
ఆదోని మండలం నుంచి పెద్దహరివాణం గ్రామాన్ని విభజించి మండలంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదోని మండలంలోని 16 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మదిరె క్రాస్ వద్ద ఆదోని - శిరుగుప్ప ప్రధాన రహదారిపై చిన్నహరివాణం, మదరె, చిన్నగొనేహళ్ గ్రామస్థులు బైఠాయించి ఆందోళన చేశారు. 16 గ్రామాల ప్రజల అభ్రియాలు తీసుకోకుండా ఆగ్రామాలను పెద్దహరివాణంలో ఎలా కలుపుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాన్ని ఎలా మండల కేంద్రంగా పరిగణిస్తారని, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదోని మండలంలోని పెద్దతుంబళం గ్రామంలో పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిలో బైఠాయించి ఆందోళన చేపట్టారు.