Share News

ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:18 AM

ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఏపీఆర్‌జేసీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న రిషిత (17) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

ఎమ్మిగనూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఏపీఆర్‌జేసీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న రిషిత (17) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల అధికారులు, రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ.. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామానికి చెందిన మస్తానయ్య, మంజుల కుమార్తె రిషితకు మూడో ఫేస్‌ కౌన్సెలింగ్‌లో ఎమ్మిగనూరు మండలం బనవాసి ఏపీఆర్‌జేసీ (ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజి)లో బైపీసీ గ్రూపులో సీటు వచ్చింది. దీంతో వారం రోజుల క్రితం రిషిత తల్లిదండ్రులు బనవాసి కళాశాలలో వదిలివెళ్లారు. అయితే ఇక్కడ ఉండలేనని రోజు తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తుండేది. అయితే వారు సర్దిచెబుతూ వచ్చారు. ఆదివారం రిషిత తల్లిదండ్రులు బనవాసిలోని ఏపీఆర్‌జేసీ కళాశాలకు వచ్చి కూతురుతో సాయంత్రం వరకు గడిపారు. మంచి కళాశాలలో సీటు వచ్చిందని, భవిష్యత్తు బాగుంటుందని ఇక్కడే ఉండి చదువుకోవాలని రిషితకు నచ్చజెప్పి 4.30 గంటలకు సొంతూరికి బయలుదేరారు. అయితే ఇక్కడ హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేని రిషిత తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. రాత్రి 7 గంటల సమయంలో హాస్టల్‌లో ఉన్న బాత్‌రూంలోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుంది. విద్యార్థిని కనిపించకపోవడంతో కొద్దిసేపు వెతికారు. చివరికి బాత్‌రూంల్లో చూడగా ఓ రూంకు గడి వేసి ఉండటంతో తెరిచేందుకు ప్రయత్నించారు. రాకపోవటంతో మరో బాత్‌రూం ద్వారా వెళ్లి చూడగా రిషిత ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌ సౌజన్యలత రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మిగనూరు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు కళాశాలకు చేరుకొని బాలికను వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చిన వెంటనే వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఎస్పీ ఉపేంద్రబాబు ఆసుపత్రికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రిషిత ఆత్మహత్యకు పాల్పడం బాధాకరమని అన్నారు. హోం సిక్‌ వల్లే మానసిక ఆందోళనకు గురైందని తెలుస్తోందన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సం బైపీసీలో చేరిన రిషిత వారం రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడటం కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - Jul 07 , 2025 | 12:18 AM