అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:02 AM
పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదోని వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదోని డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో సీఐలు శ్రీరామ్, రాజశేఖర్‌రెడ్డి బృందంగా ఏర్పడి ఆదోని శివారులో 16 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
పోలీసుల అదుపులో 16 మంది.. పరారీలో 9 మంది
రూ.1.49 కోట్ల విలువైన పందులు, మేకల పట్టివేత
మారణాయుధాలు, మూడు వాహనాలు స్వాధీనం
ఆదోని, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదోని వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదోని డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో సీఐలు శ్రీరామ్, రాజశేఖర్‌రెడ్డి బృందంగా ఏర్పడి ఆదోని శివారులో 16 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారి నుంచి 542 పశువులు, పందులు, మేకలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,49,33,000గా అంచనా వేశారు. రెండు ట్రాలీ వాహనాలు, కారు, ఇనుప రాడ్లు, కత్తులు, రాళ్లు, సీసాలు, కారం పొడి, ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట పశువులను వాహనాల్లో తరలించే వీరు అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడులు చేసేవారని పోలీసులు తెలిపారు. రెండు వారాల క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆదోనిలో పందుల యజమానులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోనూ వీరి నేరాలు వెలుగులోకి వచ్చాయి. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ పశువుల దొంగతనాలతో పాటు రాబరీ, డెకాయిట్లకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు వీరిపై 40 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.
25 మందితో గ్యాంగ్ ఏర్పాటు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వీరు పశువుల కదలికల సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. 25 మంది సభ్యులతో గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. పశువులను దొంగతనాలు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్టయిన వారు వీరే..
ఎరుకల ముత్తన్న, భజంత్రీ కృష్ణ, సిద్ధు, మల్లికార్జున, చంద్ర, పూసలప్ప, రంగన్న, ఎరుకలి నాగరాజు, హనుమంతు, అర్జున్, ఎరుకలి మహేశ్, లంబాడి శంకర్, వాల్మీకి వెంకటేశ్, ఆంజనేయులు, ఎరుకలి సురేష్, రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మరో 9 మంది అక్కడి నుంచి పరారయ్యాని పోలీసులు తెలిపారు. 25 మందిపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ హేమలత తెలిపారు.