సున్నిపెంట ఆస్పత్రి తనిఖీ
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:26 AM
శ్రీశైలం నియోజక వర్గంలోని సున్నిపెంట సీహెచ్‌సీని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.
నంద్యాల హాస్పిటల్, మే 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నియోజక వర్గంలోని సున్నిపెంట సీహెచ్‌సీని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వార్డులు, వైద్యసేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఆరుగురు వైద్యులకుగాను ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారని, మరో మూడు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సున్నిపెంటలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఆస్పత్రి భవనం నిరుపయోగంగా ఉందని, కొవిడ్ సమయంలో మాత్రమే ఆ భవనాన్ని ఉపయోగించారని ప్రస్తుతం ఆ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చి సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. సున్నిపెంట జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉండటంతో వైద్యులు, సిబ్బంది పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో నంద్యాల డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, శ్రీశైలం బీజేపీ నాయకురాలు మోమిన్ షబానా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.