ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రస్థానం
ABN , Publish Date - May 16 , 2025 | 11:33 PM
ప్రపంచ దేశాల్లో భారత ప్రధాని మోదీ వల్ల భారత్ అగ్రస్థానంలో నిలిచిందని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్
టీజీవీ కళాక్షేత్రంలో ముగిసిన ‘జై జవాన్ కల్చరల్ ఫెస్ట్’
కర్నూలు కల్చరల్, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాల్లో భారత ప్రధాని మోదీ వల్ల భారత్ అగ్రస్థానంలో నిలిచిందని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. మన సైన్యం ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో చేసిన ఆపరేషన్ సిందూర్ కార్యక్రమం ప్రపంచ ప్రశంసలు అందుకుందన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రం వారం రోజులుగా కొనసాగిన జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ శుక్రవారం రాత్రి ఘనంగా ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేశ్ తొలుత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం భరత మాత చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన జన్మదిన భారీ కేక్‌ను కట్‌చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారం రోజుల నుంచీ దేశభక్తిని ప్రబోధించే కార్యక్రమాలు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేస్తూ దేశ సైనికులకు సంఘీభావంగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తమ కుటుంబంలో తాత తండ్రుల నుంచీ స్వాతంత్య్ర సమరయోధులనీ, దేశభక్తి, సేవా సహకార గుణాలు కలవారిని గుర్తు చేశారు. కర్నూలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేటట్లు తన కుమారుడు మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోనే మహోన్నతమైన వ్యక్తిగా టీజీ వెంకటేశ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కళాక్షేత్రంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జై జవాన్ కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కాపు సంఘం రాష్ట్ర నాయకుడు ఆర్జా రామకృష్ణ తదితరులు మాట్లాడారు.
నవ్వులు పూయించిన జబర్దస్త్ కళాకారులు
జై జవాన్ కల్చరల్ ఫెస్ట్‌లో ముగింపు వేడుకల్లో భాగంగా జబర్దస్ కళాకారుల హాస్యవల్లరి కార్యక్రమం అసాంతం ప్రేక్షకులను అలరింపజేసింది. జబర్దస్త్ కళాకారులు అప్పారావు, వినోదిని, గడ్డం నవీన్, కార్తీక్, రాజమౌళి ప్రదర్శించిన స్ర్కిట్లు ప్రేక్షకులను అలరించాయి. అంతకు ముందు నాట్యాచార్యుడు కరీముల్లా బృందం దేశభక్తిని చాటిచెబుతూ చేసిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. అలాగే గజల్ గాయకుడు మహమ్మద్ మియా బృందం జానపద గీతాలు దేశ భక్తిని చాటి చెప్పాయి. ఈ కార్యక్రమంలో జీవీ శ్రీనివాసరెడ్డి, సంగా ఆంజనేయులు, జీవీ రమణ, యాంగటీశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.