Share News

కీలక మలుపు

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:05 AM

నంద్యాల జిల్లాలోనే సంచలనంగా మారిన అటవీశాఖ సొమ్ము కాజేసిన కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్‌ అటవీ శాఖ ఉద్యోగి చాంద్‌బాషా బుధవారం ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ కోర్టులో లొంగిపోగా మెజిస్ర్టేట్‌ రాహుల్‌ అంబేద్కర్‌ ఆయనకు 14రోజుల పాటు రిమాండ్‌ విధించారు.

కీలక మలుపు
చాంద్‌బాషా

అటవీ శాఖలో అవినీతి కేసులో పురోగతి

కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు చాంద్‌బాషా

రిమాండ్‌కు ఆదేశించిన న్యాయాధికారి

ఆత్మకూరు, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోనే సంచలనంగా మారిన అటవీశాఖ సొమ్ము కాజేసిన కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్‌ అటవీ శాఖ ఉద్యోగి చాంద్‌బాషా బుధవారం ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ కోర్టులో లొంగిపోగా మెజిస్ర్టేట్‌ రాహుల్‌ అంబేద్కర్‌ ఆయనకు 14రోజుల పాటు రిమాండ్‌ విధించారు. దీంతో స్థానిక పోలీసులు ఆయన్ను నందికొట్కూరు సబ్‌ జైలుకు తరలించారు. కాగా ఆత్మకూరు అటవీ డివిజన్‌ కార్యాలయంలో సుమారు 15ఏళ్ల పాటు ఏవోగా పనిచేసి గత ఏడాది జూలైలో పదవీవిరమణ పొందిన ఏఎ్‌స.చాంద్‌బాషా పని చేసిన సమయంలో అటవీశాఖకు చెందిన సొమ్మును తన సొంత అవసరాలకు దారిమళ్లించాడు. తొలుత రూ.19,25,993 విలువ గల రెండు చెక్కులను ఎఫ్‌డీపీటీ నంద్యాల చెందిన అకౌంట్‌కు పంపించాల్సి ఉండగా ఆ సొమ్మును తన బంధువుల పేర్లతో డ్రా చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 21న చాంద్‌ బాషాపై ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయగా జూలై 22వ తేది నాటికి రూ.4,37,65,501 అటవీశాఖ సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆతర్వాత కూడా విజిలెన్స్‌ కమిటీ విచారణ చేపట్టగా మరిన్ని అవకతవకలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడైన చాంద్‌బాషా అటవీశాఖ చెక్కులను తన కుటుంబీకులతో పాటు నేతాజీనగర్‌లోని మహేశ్వర ప్రింటర్స్‌ యజమాని వెంకట శివయ్య ద్వారా డ్రా చేయించి స్వాహా చేసినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా గుర్తించి అందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు.

హైకోర్టు ఉత్తర్వులతో..

హైకోర్టు ఉత్తర్వులతోనే రిటైర్డు అటవీ ఉద్యోగి చాంద్‌బాషా ఆత్మకూరు కోర్టులో లొంగిపోయారు. వాస్తవానికి అటవీ శాఖ సొమ్ము వ్యవహారంలో తొలుత రూ.19.25లక్షలు మాత్రమే అవినీతి జరిగినట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన చాంద్‌బాషా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశాడు. అలాగే తాను వాడుకున్న రూ.19.25లక్షలను తిరిగి చెల్లించానని, వయస్సు రీత్యా పోలీసులు తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని చాంద్‌బాషా హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో చాంద్‌బాషాను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ తర్వాత చాంద్‌బాషా అక్రమాలు బట్టబయలు కావడంతో ఏకంగా రూ.4.37కోట్లు అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో చాంద్‌బాషా స్వాహా చేసింది రూ.19.25లక్షలు కాదని.. రూ.4.37కోట్లు అని తేలింది. ఇది పెద్ద కుట్ర అని పోలీసులు హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేస్తూ వచ్చారు. అయితే హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చాంద్‌బాషా వ్యవహరించడంతో ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చి వారంలోగా ఆత్మకూరు కోర్టు (మదర్‌ కోర్టు)లో లొంగిపోవాలని హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐదు నెలల తర్వాత చాంద్‌బాషా కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది.

Updated Date - Sep 11 , 2025 | 12:05 AM