Share News

మారిన ఆహారపు అలవాట్లతో అనారోగ్యం

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:18 AM

: సమాజంలో మారిన ఆహారపు అలవాట్లు నేడు అనేక అనారోగ్యాలకు కారకాలుగా నిలుస్తున్నాయని ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు

మారిన ఆహారపు అలవాట్లతో అనారోగ్యం
మాట్లాడుతున్న డా. ఖాదర్‌ వలి

సిరి ధాన్యాలతో బీపీ, షుగర్‌ని నియంత్రించవచ్చు

ఆహార, ఆరోగ్య నిపుణుడు ఖాదర్‌ వలి

కర్నూలు కల్చరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మారిన ఆహారపు అలవాట్లు నేడు అనేక అనారోగ్యాలకు కారకాలుగా నిలుస్తున్నాయని ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు. అదితి చిరుధాన్యాలు సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘చిరుధాన్యాల అవగాహన సదస్సు’కు డాక్టర్‌ ఖాదర్‌ వలి ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలులగా భారతీయ ఆహార పంటలు పండించే విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. అయితే ఇవన్నీ ప్రకృతి సహజంగా వస్తున్న మార్పులు కాదని, కృత్రిమంగా కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడుల వల్ల వచ్చినవే అని ఆరోపించారు. పంటల ఉత ్పత్తులు పెరిగేందుకు ఎరువులను వాడకం మొదలైందని, ప్రతిఫలంగా వాటి ప్రభావం ఆహార ధాన్యాలపై దుష్పరిణామాలు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మందులు చల్లిన వరి, గోధుమ వంటి పంటల్ని 16వందల మిలియన్‌ టన్నుల పండిస్తూ ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించేలా చర్యలు జరిగిపోతున్నాయని అన్నారు. వర్షం పడితే పండే పంటలు చిరుధాన్యాలని, నీళ్లు కట్టి పండించే పంటలు వరి, గోధుమలు అని చెప్పారు. ప్రకృతి సహజంగా వర్షాధారంతో పండే పంటలకు, నీటినిలువతో పండించే పంటలకు ఎంతో తేడా ఉంటుందని అన్నారు. ఒకనాడు దేశంలో 240 రకాల చిరుధాన్యాలు పండేవని, నేడు పదికి మించి సిరిధాన్యాలు లభించడం లేదని చెప్పారు. సీ4 గ్రాసెస్‌ సీడ్‌గా చెప్పుకునే చిరుధాన్యాల్లో ఫైబర్‌ శాతం ఎక్కువ ఉండి, ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవి తోడ్పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉంటూ చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. మరో అతిథి పారిశ్రామికవేత్త టీజీ శివరాజప్ప మాట్లాడుతూ ఒకప్పుడు చిరుధాన్యాల పంటలకు నిలయంగా జిల్లా ఉండేదని, ఆ పరిస్థితులు తిరిగి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ జిల్లా అధ్యక్షుడు ఐ. విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాలు పండించేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో అదితి చిరుధాన్యాల సంస్థ అధినేతలు సోమశేఖర్‌ పోగుల, మోహన్‌కుమార్‌ కడింపల్లి తదితరులు ప్రసంగించారు.

Updated Date - Nov 25 , 2025 | 01:18 AM