గిరిజన పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:26 AM
పాణ్యం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు శనివారం అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది. విద్యార్థులు విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా అధికారులు పాణ్యం సీహెచ్‌సీకి తరలించారు
పాణ్యం సీహెచ్‌సీకి తరలింపు
పాఠశాలను పరిశీలించిన ఐటీడీఏ పీవో, అధికారులు
పాణ్యం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు శనివారం అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది. విద్యార్థులు విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా అధికారులు పాణ్యం సీహెచ్‌సీకి తరలించారు. దీంతో అప్రమత్తమైన డీటీడబ్ల్యుఓ, శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంఈఓ కోటయ్య పాణ్యంకు వెళ్లారు. పాఠశాలను పరిశీలించి, విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు అస్వస్థత కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాగునీరు కలుషితం అయ్యాయన్న కారణంగా నీటి శ్యాంపిళ్లను నంద్యాల పరీక్ష కేంద్రానికి పంపారు.
నెల రోజుల క్రితం మారిన విద్యార్థులు
పాణ్యం గురుకుల పాఠశాల భవనంలో ఉంటున్న 218 మంది విద్యార్థులు అరకొర వసతులతో విద్యనభ్యసిస్తున్నారు. కాగా నెల రోజుల క్రితం డ్రైనేజీ కారణంగా నెరవాడ మెట్ట సమీపంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాల భవనంలోకి మార్చారు.
ఈ పాఠశాల పక్కనే మురుగుగా ప్రవహిస్తున్న ఎస్సార్బీసీ కాలువలోనే విద్యార్థులకు అందించే తాగునీటి పైపులైను ఉండడం గమనార్హం. ఈ పైపులైను లీకేజీల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా పాణ్యంలో పాఠశాల భవనం నుంచి వెలువడే మురుగు నీరు బయటకి వెళ్లడానికి గత ఏడాది నుంచి ప్రిన్సిపాల్ కృష్ణానాయక్ కలెక్టరు, ఎమ్మెల్యే, పీఓలకు వినతిపత్రాలు అందజేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం విద్యార్థులను నెరవాడ మెట్ట సమీపంలోని మినీ గురుకులం భవనానికి తరలించారు.
ఈ భవనంలో మూడు మరుగుదొడ్లు ఉండడంతో 218 విద్యార్థులకు సరిపోకపోవడంతో వారు బయటకు వెళ్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం కూడా అస్వస్థతకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మినీ గురుకులంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు.
అస్వస్థతకు అధికారుల నిర్లక్షమే కారణం
విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి అధికారులే కారణం. ఏడాదిగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. మురుగుకాలువ వెళ్లే స్థలం ప్రభుత్వానిది కాగా ఈ స్థలం ఆక్రమణకు గురైనా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్షానికి నిదర్శనం. అస్వస్థతకు గల కారణాలను విశ్లేషించి మళ్లీ ఈ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి నాణ్యమైన తాగునీరందించాలి. - దేవదానం, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు
మెనూ ప్రకారమే ఆహారం పంపిణీ
మెనూ ప్రకారమే ఆహారం అందించాం. శుక్రవారం సాయంత్రం కారం బొరుగులు, రాత్రి అన్నం, సాంబారు, శనివారం ఉదయం ఇడ్లీ, చట్నీ అందిం చాం. తాగునీరు బోరునుంచి వచ్చే నీటిని పంపిణీ చేస్తున్నాం. పాణ్యంలో పాఠ శాల నుంచి వెలువడే మురుగు నీరు నిల్వకు అనువైన ప్రాంతం లేకపోవడంతో నెరవాడ మెట్ట సమీపంలోని మినీ గురుకుల భవనానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చాం. కలుషిత నీరే కారణమన్నది నీటి పరీక్షల అనంతరం తెలుస్తుంది. విద్యార్థులకు అనువైన మరుగుదొడ్లు లేవు. - కృష్ణానాయక్, ప్రిన్సిపాల్
రెండు రోజుల్లో సమస్య పరిష్కారం
రెండు రోజుల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు అందించేలా చర్యలు చేపడతాం. పాణ్యంలోని మురుగుకాల్వ సమస్యను పరిష్కరిస్తాం. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. గురుకుల పాఠశాలకు మంజూరైన భవన నిర్మాణానికి చర్యలు చేపడతాం. - వెంకటశివప్రసాద్, డీటీడబ్ల్యూఓ