Share News

హాస్టళ్ల నిర్వహణ లేకుంటే చర్యలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:22 AM

జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్‌ డా.సిరి హెచ్చరించారు

హాస్టళ్ల నిర్వహణ లేకుంటే చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

వసతి గృహాల సంక్షేమాధికారులు, అధికారులకు కలెక్టర్‌ హెచ్చరిక

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్‌ డా.సిరి హెచ్చరించారు. శుక్రవారం సునయన ఆడిటోరియంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో టాయిలెట్లు, ఫ్యాన్లు, లైటింగ్‌, డోర్లకు మెష్‌, ఆర్వో ప్లాంట్ల మరమ్మతులుంటే 15 రోజుల్లోపు పూర్తిచేయాలన్నారు. చిన్న చిన్న మరమ్మతులకు ఇంపటికే నిధులు కేటాయించామన్నారు. భారీ మరమ్మతులకు నిధులు తెచ్చి కేటాయిస్తామన్నారు. హాస్లళ్లలో ముళ్లపొదల తొలగింపు, డ్రైనేజీ పనులు అవసరమైన చోట దీపాలు ఏర్పాటు చేయించాలని డీపీవోను ఆదేశించారు. టాయిలెట్లకు నీరు, సెప్టింగ్‌ ట్యాంకు కనెక్షన్‌, సోక్‌ టిప్స్‌ పనులు చేయించాలని ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. కార్పొరేషన్‌ పరిధిలోని హాస్టళ్లకు స్వచ్ఛబారత్‌ కింద టాయిలెట్లను నిర్మించాలని మున్సిపల్‌ అడిషినల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. రెండు రోజుల క్రితం కోసిగి బీసీ హాస్టల్‌ను తనిఖీ చేయగా, నిర్వహణ లేదని, సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ట్యూషన్‌ చెప్పేలా వలంటీర్లను నియమించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, గిరిజన సంక్షేమ అధికారి సురేష్‌, మైనార్టీ అధికారి సబీహా పర్వీన్‌, కోఆర్డినేటర్‌ శ్రీదేవి, డీపీవో భాస్కర్‌, ఆర్‌డబ్లూఎస్‌ అధికారులు, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు సహాయ సంక్షేమ అధికారులు ఉన్నారు

Updated Date - Dec 27 , 2025 | 12:22 AM