బడి బాగుండాలని..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:57 PM
హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,664 మంది విద్యార్థులు ఉన్నారు. అవసరమైన మేరకు తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.2.34 కోట్లతో 20 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు.

జిల్లాలోని పాఠశాలలకు రూ.29.83 కోట్లు విడుదల
వైసీపీ హయాంలో నిలిచిన నాడు-నేడు పనులు
టీడీపీ కూటమి వచ్చాక విద్యాలయాల అభివృద్ధిపై దృష్టి
తక్షణమే ‘మన బడి-మన భవిష్యత్తు’ ఫేజ్-2 పనులు చేపట్టేలా ఆదేశం
హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,664 మంది విద్యార్థులు ఉన్నారు. అవసరమైన మేరకు తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.2.34 కోట్లతో 20 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు. కష్టాలు తీరుతాయని విద్యార్థులు సంతోషించారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పిల్లర్లు, మొండి గోడలతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. హొళగుందలో ఒక్కటే కాదు జిల్లాలో 1,074 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి దాదాపు ఇదే. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ‘మన బడి-మన భవిష్యత్తు’ ఫేజ్-2 కింద తక్షణమే పూర్తి చేయడానికి రూ.29.83 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో జిల్లాకే కేటాయించడం కొసమెరుపు. పేద విద్యార్థులు చదువుకొనే ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో వివిధ పాఠశాలలు 2,251 ఉన్నాయి. ఆయా విద్యాలయాల్లో 4.50 లక్షలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం వివిధ పథకాల కింద ఏటా రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఇప్పటికీ ఆయా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేమితో పేద విద్యార్థులు పడుతున్న అవస్థలెన్నో. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాలయాల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రతి గదిలో ఓ ఫ్యాన్, ట్యూబ్‌లైట్లు, ఫర్నీచర్, రంగులు, మరమ్మతులు, ఆకుపచ్చ శుద్ధ బోర్డు వంటి సౌకర్యాలు కల్పిస్తామని ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో ఫేజ్-2 కింద 1,074 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఎంపిక చేసి దాదాపు రూ.521 కోట్లతో 1,746 పనులు చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామని ప్రగల్బాలు పలికిన వైసీపీ పెద్దలు ఆచరణలో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్నారు. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పనులు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ‘మన బడి-మన భవిష్యత్తు’ పేరిట విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసంపూర్తి పనులపై దృష్టి సారించారు.
అసంపూర్తి పనులు.. అవస్థల్లో విద్యార్థులు:
జిల్లాలో 1,074 వివిధ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘మన బడి నాడు-నేడు’ ఫేజ్-2 కింద 1,746 పనులు గుర్తించారు. అందులో 311 పాఠశాలల్లో 1,311 అదనపు తరగతి గదులు, 367 పాఠశాలలకు ప్రహరీ నిర్మాణ పనులు మంజూరు చేశారు. 35-40 శాతం పనులు పూర్తి చేయలేదు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు.. ఇలా వివిధ నిర్మాణాలు పిల్లర్లు, మొండి గోడలతో అసంపూర్తిగా ఆగిపోయాయి. సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, బిల్లులు కూడా రాకపోవడంతో పనులు చేసిన పాఠశాలల యాజమాన్య కమిటీలు ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. అసంపూర్తి పనుల వల్ల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. 2024 జూన్ 12న కొలుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘మన బడి-మన భవిష్యత్తు’ ఫేజ్-2 కింద అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది.
గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన పనులు కొన్ని
హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,664 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాడు-నేడు కింద రూ.2.34 కోట్లతో 20 అదనపు తరగతి గదులు మంజూరు కాగా.. 9 గదుల నిర్మాణాలు మొదలు పెట్టారు. మూడు గదులు టాప్ లెవల్, ఆరు గదులు లెంటిల్ లెవల్‌లోనే అసంపూర్తిగా అపేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో పనులు మొదలు కానున్నాయి.
ఆలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.32 లక్షలతో ప్రహరీ నిర్మాణం చేపట్టారు. నాడు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
కోసిగి మండలం చిన్నబొంపల్లి గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో 678 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రూ.1.20 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు. రూ.76 లక్షలు ఖర్చు చేశారు. బిల్లులు రాకా.. అవసరమైన నిధులు మరో రూ.40 లక్షలు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేవనకొండ మండలం కరివేముల జడ్పీ ఉన్నత పాఠశాలలో జీ+1 తరహాలో 8 అదనపు తరగతి గదులు, వంటగతి, తాగునీటి సంప్, ప్రహరీ నిర్మాణాలకు రూ.1.50 లక్షలు మంజూరు చేశారు. 70 శాతం పనులు పూర్తయినా.. ఆ తరువాత నిధులు రాకపోవడంతో అసంపూర్తిగా ఆపేశారు. తెర్నేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.2.16 కోట్లతో 18 అదనపు తరగగి గదులు నిర్మాణం చేపట్టినా మొదటి అంతస్తు పైకప్పు లెవల్‌లో ఆగిపోయాయి. గుండ్లకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
కోడుమూరు మండలం కలపరి జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 179 మంది విద్యార్థులు చదువుతున్నారు. 9 అదనపు తరగతి గదులు మంజూరు చేస్తే.. ఐదు గదులు నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. రంగులు, విద్యుత్ పరికరాలు, కిటికీలు పనులు చేయాలి. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగిస్తున్నారు.
గూడూరు మండలంలో 31 పాఠశాలలకు గత వైసీపీ హయాంలో నాడు-నేడు కింద అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, మైనర్ రిపేరి వంటి పనులు మంజూరు చేశారు. నిధులు లేకపోవడంతో జులకల్లు, మునగాల, వై.ఖానాపురం, బూడిదపాడు, చనుగొడ్ల, పెంచికలపాడు, పొన్నకల్ గ్రామాల్లో అదనపు తరగతి గదులు అసంపూర్తిగా ఆగిపోయాయి.
జిల్లాలో వైసీపీ హయాంలో నాడు-నేడు కింద పాఠశాలల్లో చేపట్టిన వివిధ నిర్మాణాల పరిస్థితి ఇదాలు ఇలాగే ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ‘మన బడి-మన భవిష్యత్తు’ ఫేజ్-2 కింద తొలి విడతగా రూ.29.83 కోట్లు మంజూరు చేయడంతో 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అసంపూర్తి పనులు పూర్తి చేసి బడులు పునఃప్రారంభం నాటికి విద్యార్థులు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.
జిల్లాకు రూ.29.83 కోట్లు:
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మన బడి-మన భవిష్యత్తు ఫేజ్-2 కింద రాష్ట్రంలో 22,344 పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో రూ.8 వేల కోట్లలో మౌలిక వసతుల కల్పన పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. అందులో తొలి విడతగా 407.91 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో అత్యధికంగా కర్నూలు జిల్లాకు రూ.29.83 కోట్లు, నంద్యాల జిల్లాకు 11.71 కోట్లు కేటాయించారు. నిధులు రావడంతో ప్రభుత్వ బడులకు మహర్దశ రానుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
మన బడి-మన భవిష్యత్తు ఫేజ్-2 వివరాలు:
ఎంపిక చేసిన విద్యాలయాలు : 1,074
మంజూరు వివిధ పనులు : 1,746
అదనపు తరగతి గదులు : 311 పాఠశాలలు,
1,311 గదులు
ప్రహరీలు : 367 పాఠశాలలు
అంచనా విలువ : రూ.520 కోట్లు
చేసిన ఖర్చు : రూ.276 కోట్లు
తాజాగా ఇచ్చిన నిధులు : రూ.29.83 కోట్లు