హైడ్రామా..!
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:09 AM
విజయడెయిరీ పరిధిలో ఉన్న మాచినేనిపల్లి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలో హైడ్రామా నడిచింది.
ఉత్కంఠగా మాచినేనిపల్లె సహకార సంఘం ఎన్నికలు
రెండు నామినేషన్లు దాఖలు
ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి
అందుకు భిన్నంగా ఎంపీడీఓ ప్రకటన
నంద్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయడెయిరీ పరిధిలో ఉన్న మాచినేనిపల్లి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలో హైడ్రామా నడిచింది. సోమవారం రుద్రవరం మండలం మాచినేనిపల్లి గ్రామంలో సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. మాచినేనిపల్లె సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రతాప్‌రెడ్డి నోటీసును విడుదల చేశారు. కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసిందని ఆ నోటీలు వెల్లడించారు. ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి, ఎం.జెల్లయ్యలు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవం అనివార్యమైంది. అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినట్లు ఎంపీడీఓలు తెలిపారు. విజయ డెయిరీ పరిధిలో ఆరు విడతలుగా జరగాల్సిన ఎన్నికలు ఇప్పటి వరకు 3 విడతలు మాత్రమే జరిగాయి. విజయ టీడీపీ, వైసీపీ నాయకులు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మాచినేనిపల్లి ఎన్నికపై విభిన్న ప్రకటనలు
పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికల అధికారి మాచినేనిపల్లి పాలకవర్గ కమిటీ ఏకగ్రీవమైనట్లు సాయంత్రం ప్రకటించారు. అయితే ఎంపీడీఓ భాగ్యలక్ష్మి ప్రకటన మాత్రం మరోలా ఉంది. నామినేషన్ వేసేందుకు ఎవరూ రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియ జరగలేదంటూ నోటీసును విడుదల చేశారు. దీంతో రెండు రకాలుగా వచ్చిన విభిన్న ప్రకటనతో ప్రజలు ఖంగుతిన్నారు. ఏదిఏమైనా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అధికారి ప్రకటనే ఫైనల్ అంటూ చర్చనీయాంశంగా మారింది.
నంద్యాల విజయ డెయిరీ పరిధిలోని మాచినేనిపల్లిలో నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డిని, టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్ రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నెలోని మాజీ ఎమ్మెల్యే గృహానికి తెల్లవారుజామునే చేరుకుని హౌస్ అరెస్టు చేశారు. ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు.
అక్రమ ఎన్నిక చెల్లదు : విఖ్యాత్
ఈ ఎన్నికల తంతు పాల ఉత్పత్తి దారుల కార్యాలయంలో జరగాల్సి ఉండగా కార్యాలయ తలుపులు తెరవకుండానే మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రగుడిదిన్నెలో అక్రమంగా నిర్వహించారు. ఇలాంటి ఎన్నిక చెల్లదు.