సెస్సుకు భారీ గండి
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:41 PM
కర్నూలు జిల్లాలోని ఏడు మార్కెట్ కమిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రూ.40.40 కోట్ల సెస్సును వసూలు చేసి రాబోయే కాలంలో రైతులకు సరిపడ వసతులను కల్పించాలని మార్కెటింగ్ శాఖ లక్ష్యంగా పని చేస్తోంది.
దిగుబడి తగ్గడంతో మందగించిన సెస్సు
ఈ ఆర్థిక సంవత్సరం సెస్సు లక్ష్యం రూ.40.40 కోట్లు
గత 8 నెలల్లో వసూలైంది కేవలం రూ.16.81 కోట్లు మాత్రమే
కర్నూలు జిల్లాలోని ఏడు మార్కెట్ కమిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రూ.40.40 కోట్ల సెస్సును వసూలు చేసి రాబోయే కాలంలో రైతులకు సరిపడ వసతులను కల్పించాలని మార్కెటింగ్ శాఖ లక్ష్యంగా పని చేస్తోంది. అయితే.. ఊహించని విధంగా ఖరీ్‌ఫలో భారీ వర్షాలు, తుఫానులతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి, కంది తదితర పంటలు సగం కూడా రైతుల చేతికి అందలేదు. ఫలితంగా ఇటు రైతులకు నష్టాలు, మార్కెటింగ్ శాఖకు భారీగా సెస్సు ఆదాయం తగ్గిపోయింది. కొన్ని మార్కెట్ కమిటీల్లో అధికార యంత్రాంగానికి కూడా జీతాలు సర్దుబాటు చేయలేని పరిస్థితి దాపురించింది.
కర్నూలు అగ్రికల్చర్, ఆంధ్రజ్యోతి
సెస్సు లక్ష్యం 40.40 కోట్లు.. వసూళ్లు మాత్రం రూ.16.81 కోట్లే
కర్నూలు జిల్లాలో ఏడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కర్నూలు మార్కెట్ కమిటీ నుంచి రూ.7.08 కోట్లు సెస్సు రూపంలో రాబట్టాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత లక్ష్యాన్ని ఇచ్చారు. ఆదోని మార్కెట్ కమిటీకి రూ.18 కోట్లు, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ నుంచి 8.50 కోట్లు, ఆలూరు నుంచి రూ.1.10 కోట్లు, పత్తికొండ నుంచి రూ.95లక్షలు, కోడుమూరు మార్కెట్ కమిటీ నుంచి రూ.1.80 కోట్లు, మంత్రాలయం కమిటీ నుంచి రూ.1.35 కోట్లు.. మొత్తం రూ.40.40 కోట్లు వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని కర్నూలు జిల్లాలోని ఏ మార్కెట్ కమిటీ కూడా సాధించలేకపోయింది. కనీసం సగం కూడా వసూలు చేయలేని దుస్థితిలో మార్కెట్ కమిటీలు ఉండిపోయాయి. అలాగే కర్నూలు మార్కెట్ కమిటీకి రూ.8.70 కోట్ల సెస్సును వసూలు చేయాల్సి ఉండగా.. రూ.3.72 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆదోని మార్కెట్ కమిటీ నుంచి రూ.7.62 కోట్లు మాత్రమే వసూలైంది. ఎమ్మగనూరు నుంచి రూ.3.82 కోట్లు, ఆలూ రు నుంచి రూ.29.62 లక్షలు, పత్తికొండ నుంచి రూ.56 లక్షలు, కోడుమూరు మార్కెట్ కమిటీ నుంచి రూ.53.98 లక్షలు, మంత్రాలయం నుంచి 19.13 లక్షలు మాత్రమే వసూలైంది. ఏడు మార్కెట్ కమిటీల నుంచి ఇప్పటి దాకా మొత్తం రూ.16.81 కోట్లు మాత్రమే వసూలైంది. ఇది కేవలం 41.62 శాతం మాత్రమే. మిగిలిన లక్ష్యాన్ని మరో నాలుగు నెలల్లో ఏ విధంగా వసూలు చేయాలో అర్థంగాక ఆయా మార్కెట్ కమిటీల సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 7 మార్కె ట్ కమిటీలలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో మాత్రమే పంట ఉత్పత్తుల కొను గోలు జరుగుతోంది. ఈ యార్డుల్లో తప్పనిసరిగా రైతులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సెస్సు ఆదాయం తగ్గిపోతే వసతులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉండదు.
భారీగా సెస్సు ఆదాయం తగ్గింది
కర్నూటు మార్కెట్ యార్డు సెస్సు ఆదాయం తగ్గింది. ఈ సంవత్సరం కర్నూలు మార్కెట్ కమిటీకి సెస్సు ఆదాయం రూ.8.70కోట్ల వసూలు చేయాలని లక్ష్యాన్ని ఇచ్చారు. ఇప్పటికీ అయితే కేవలం రూ.3.72 కోట్లు మాత్రమే వసూలైంది. మిగిలిన మొత్తాన్ని నాలుగు నెలల్లో వసూలు చేయాల్సి ఉంది. సెస్సు వసూలుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. వరుసగా కురిసిన వర్షాలు, తుఫాన్ల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గింది. దీనివల్ల వసూళ్లు మందగించాయి. ప్రధానంగా వేరుశనగ, పత్తి, ఉల్లి దిగుబడులు భారీగా తగ్గడమే కాకుండా ధరలు కూడా రైతులు ఆశించిన స్థాయిలో అందలేదు. దీని వల్ల సెస్సును పూర్తి స్థాయిలో వసూలు చేయలేకపోయాము. అయితే మార్కెట్ యార్డులో రైతులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
- జయలక్ష్మి, కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీ, కర్నూలు