Share News

నిర్మాణదారులకు భారీ ఊరట..!

ABN , Publish Date - Jul 28 , 2025 | 10:56 PM

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది.

నిర్మాణదారులకు భారీ ఊరట..!

రియల్‌ ఎస్టేట్‌కు ఊతం

అనధికార నిర్మాణాలు, నాన్‌ లే-అవుట్‌ ప్లాట్‌లకు క్రమబద్దీకరణ

చాలా కాలంగా ఎదురు చూస్తున్న నిర్మాణదారులు

ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలు జారీ

వైసీపీ హయాంలో అనుమతులు నిరాకరణ

సవరించిన కూటమి ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా ఎల్‌ఆర్‌ఎస్‌ (ఆన్‌ అప్రూవ్డ్‌ లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విషయంపై ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌లో ఆమోదం కూడా తెలపడంతో తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో వేసిన అనధికార లేఅవుట్లకు ఈ స్కీమ్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్లాను లేకుండా నిర్మాణాలు చేసుకున్న నిర్మాణదారులకు లబ్ధి చేకూరనుంది. నిజానికి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు క్రమబద్దీకరణను అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్‌లను పొడిగించకుండా రద్దు చేయడంతో ఐదేళ్లుగా నిర్మాణాదారులు తమ నిర్మాణాలను క్రమబద్దీంచుకొనే అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు ప్లాను మంజూరుకు అవకాశం లేని నిర్మాణాలు పట్టణ పరిధిలో అనేకంగా ఉన్నాయి.

-ఆదోని టౌన్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి)

నిర్మాణ రంగానికి ఊతం

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగానికి భారీ ఊరట లభించినట్లయింది. అనధికార లేఅవుట్‌లలో స్థలాల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది. స్థల రిజిస్ట్రేషన్‌ విలువలో నిర్ణీత రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన నిబంధనలను ఎత్తివేసింది. నాన్‌ లేఅవుట్‌లో ప్లాట్‌ కొనుగోలు చేసుకుంటే క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మొత్తం లేఅవుట్‌ను గుర్తించాలని మున్సిపాలిటీలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాతే అందులో ఉన్న ప్లాట్‌లను క్రమబద్ధీకరించేలా నిబంధన పెట్టింది. ఫలితంగా 2020లో అమలు చేసిన లేఅవుట్‌ క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడానికి నిర్మాణదారులు వెనుకంజ వేశారు. ప్రతి మున్సిపాలిటీలోనూ కొద్దిమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వాటిని క్రమబద్ధీకరించలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగానే ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగిసిపోయింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపో యాయి. కూటమి ప్రభుత్వం తీసుకు న్న తాజా నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించనుంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పెండింగ్‌ దరఖాస్తులను ప్రస్తావించింది. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని దిశానిర్దేశం చేసింది. అయితే అప్పట్లో నిర్ణీత రుసుం చెల్లించిన వారికే వర్తిస్తుంది. లేదంటే కొత్తగా విధించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

నాన్‌ లే అవుట్‌కు గడువు

ప్రభుత్వం నాన్‌ లేఅవుట్‌ అయినా, లేఅవుట్‌ అయినా ప్లాట్ల క్రమబద్దీకరణపై గడువు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2025 జూలై 30 నాటికి ఉన్న లేఅవుట్‌లనే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే అప్పటికే లే అవుట్‌లోని ఒక ప్లాట్‌ అయినా విక్రయించాలి. అప్పుడే అందులోని ఇతర ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు నిబంధనలు వర్తించవు. ఇటీవలి కాలంలో పట్టణాల్లో నాన్‌ లేఅవుట్‌లు అధికంగా పుట్టుకొచ్చాయి. వాటిపైనే రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి. కొన్నింటిని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు. విక్రయాలు జరగడం లేదు. వీటికి మాత్రం ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వర్తించే అవకాశం లేదు.

ఇక నాన్‌ లే-అవుట్‌ ప్లాట్లకు డిమాండ్‌

వైసీపీ హయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను రద్దు చేయడంతో నాన్‌లే-అవుట్‌ ప్లాట్లలో చిన్న నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు కోసం రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల దాకా ఫీజులు చెల్లించాల్సి రావడంలో చాలా మంది యాజమానులు ఇళ్ల నిర్మాణాల కోసం ముందుకు రాలేదు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నాన్‌ లే-అవుట్‌ ప్లాట్లకు డిమాండ్‌ పడిపోయి వాటి ధరలు కూడా బాగా పడి పోయాయి. ప్రభుత్వం తిరిగి ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నాన్‌ లే-అవుట్‌ ప్లాట్లలో నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్లాట్ల ధరలు కూడా పెరిగే అవకాశం కలిగింది.

నిబంధనలు ఇవీ..

ఎస్‌ఆర్‌ఎస్‌ స్కీంలో భాగంగా 2025 జూన్‌ 30 వరకు రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు అవకాశం ఉంటుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ కోసం 90 రోజులు గడువు ఉంటుంది.

ప్రతి ప్లాట్‌కు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ఉండాలి.

ప్లాట్‌ విక్రయం తేదీ 30-06-2025లోపు అయి ఉండాలి.

ప్లాట్‌ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలు ఉంటాయి.

10 శాతం ఓపెన్‌ స్పేస్‌ లేకపోతే 14 శాతం అదనపు చార్జీలు విధిస్తారు.

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు కూడా అవకాశం ఉంటుంది.

ఇందుకు సంబంధించిన పోర్టల్‌ ఆగస్టు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ స్కీమ్‌ అమలు ద్వారా అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగర, పట్టణ, కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు ఆయా పథకాల ద్వారా వివిధ నిర్మాణాలు, లేఅవుట్‌లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ప్రయోజనాలెన్నో..

అనధికార లేఅవుట్‌లో ప్లాట్లను క్రమబద్ధీకరిస్తే మున్సిపాలిటీ నుంచి ముఖ్యమైన ఎల్పీ నంబర్‌ వస్తుంది.

నిర్మాణాలకు మున్సిపల్‌ అధికారులు ప్లాన్‌ మంజూరు చేస్తారు. ప్లాన్‌ ఉంటే బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ప్లాట్‌ యజమానులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు నిర్మాణాలు జోరందుకుంటాయి. కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పనులు దొరుకుతాయి.

క్రయ, విక్రయాలు చేసుకునేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

భవన నిర్మాణాలకు సునాయసంగా అనుమతులు లభిస్తాయి.

చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం

క్రమబద్దీకరణకు అవకాశం లేకపోడంతో అక్రమ నిర్మాణాలపై బ్యాంకుల్లో రుణాలు లభించడం లేదు. కూటమి ప్రభుత్వం బీపీఎస్‌ను తిరిగి అమలు చేస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది. అపరాధ రుసుం విషయంలో మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే అందరూ హర్షిస్తారు.

- తాహేర్‌ బాష, ఆదోని

మధ్య తరగతికి ప్రయోజనం కలుగుతుంది

బీసీఎస్‌తో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ జీవోలతో మధ్య తరగతి వారికి భారీ ఉపశమనం లభిస్తుంది. అక్రమ కట్టడాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది.

- బాలమద్దయ్య, ఇన్‌చార్జ్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, ఆదోని

Updated Date - Jul 28 , 2025 | 11:21 PM