Share News

అన్నదాతకు అపార నష్టం

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:28 AM

ఎడతెరిపి లేని అధిక వర్షాలకు మండల రైతులు కుదేలవుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలవాలుతుంటే అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు కనీసం పెట్టుబడి లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

అన్నదాతకు అపార నష్టం
సాతనూరులో రోడ్డుపై వేసిన ఉల్లిగడ్డలు కోసిగిలో అధిక వర్షానికి ఎర్రతెగులు సోకిన పత్తి పంట

అఽధిక వర్షాలకు కుదేలవుతున్న రైతులు

కోసిగిని కరువు మండలంగా ప్రకటించాలి

కోసిగి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేని అధిక వర్షాలకు మండల రైతులు కుదేలవుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలవాలుతుంటే అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు కనీసం పెట్టుబడి లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మండలంలో 33వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఉల్లి, పత్తి, వేరుశనగ, బొప్పాయి, ఆముదం, సజ్జ, జొన్న, కొర్ర పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా వచ్చినా అధిక వర్షాల దాటికి పత్తి, ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 1250 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. అధిక వర్షానికి ఉల్లి రైతు తీవ్రంగా నష్టపోయారు.

పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొందరు రైతులు పొలాల్లోనే ఉల్లి పంటను పారబోశారు. మరికొందరు రైతులు చెన్నై మార్కెట్‌కు తీసుకెళ్లి కనీసం చార్జీలకు కూడా రాకుండా అక్కడే వదిలేసి వచ్చారు. మరికొందరు రైతులు రోడ్లపైనే పంటను పారబోశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి రైతులు నష్టాన్ని చవి చూశారు.

అలాగే 23,500 ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. చేతికి వచ్చే సమయంలో వరుణదేవుడు దాటికి ఎర్రతెగులు సోకి పంట పూర్తిగా దెబ్బతింది. అలాగే వేరుశనగ పంటను 2100 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగకు కూడా అధిక వర్షందాటికి భూమిలోనే పంటకు మొలకలు ఎత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోసిగి మండలాన్ని కరువు మండలంలగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.

ఉల్లి పంట వేసి నష్టపోయా

రెండెకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశా. అధిక వర్షాల ధాటికి పంట అంతంత మాత్రమే వచ్చింది. వచ్చిన పం టకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇప్పటి వరకు ఉల్లి పంట వేసి రూ.2 లక్షలు నష్టపోయా. ప్రభుత్వమే ఆదుకోవాలి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పింజరి ఖాదర్‌ బాషా, రైతు సాతనూరు

పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తాం

మండలంలో నష్టపోయిన రైతులను, పంటలను పరిశీలించి నివేది కలను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. వేరే మండలాల్లో పోల్చుకుంటే కోసిగి మండలంలో ఓమోతాదులోనే వర్షపాతం నమో దైంది. నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపిస్తాం. ఎం.వరప్రసాద్‌, ఏవో, కోసిగి

Updated Date - Sep 22 , 2025 | 12:28 AM