Share News

ఇంకెన్నేళ్లు..?

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:10 PM

‘ప్రతి నీటి బొట్టూ సద్వినియోగం చేసుకోవాలి.

ఇంకెన్నేళ్లు..?
బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ సమీపంలో అసంపూర్తిగా ఎస్సార్బీసీ మెయిన్‌ కెనాల్‌ వంతెన

అసంపూర్తిగా ఎస్సార్బీసీ సూపర్‌ ప్యాసేజెస్‌, ట్రాఫ్ట్‌ అక్విడక్ట్స్‌

ఏళ్లు గడస్తున్నా పూర్తికాని నిర్మాణాలు

కాలువ ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు

రూ.15 వేలు కూడా తీసుకోలేని దైన్యపరిస్థితి

పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

‘ప్రతి నీటి బొట్టూ సద్వినియోగం చేసుకోవాలి. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటితో జలాశయాలు, చెరువులు నింపాలి. రాయలసీమ జిల్లాల్లో వివిఽధ కాల్వలు, ప్రాజెక్టుల అసంపూర్తి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఎస్సార్బీసీ కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది’ ఈ ఏడాది ఆగస్టు 1న సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో ఇంజనీర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇది సాకారం కావాలంటే ఎస్సార్బీసీ కాలువ పైన చేపట్టే నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఏళ్లు గడస్తున్నా.. సూపర్‌ ప్యాసేజెస్‌, ట్రాఫ్‌ అక్విడక్ట్‌, ఎస్‌ఎల్‌బీ వంటి నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఏటేటా ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మాత్రం రావడం లేదు. పాలకులు నిర్లక్ష్యం కరువు రైతులకు శాపంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాదైనా అసంపూర్తి పనులను పూర్తి చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే.. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోగా పనులను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఎస్సార్బీసీ అసంపూర్తి పనులపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా జలాలు మళ్లించి రాయలసీమ కరువు పల్లెసీమలను సస్యశామలం చేయాలన్న ఆశయంతో 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ) నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) నుంచి ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో అవుకు జలాశయం వరకు ఎస్సార్బీసీ కాలువను నిర్మించారు. శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో 1.53 లక్షల ఎకరాలకు సాగునీరు, వివిధ గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యం. 2004లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 38 టీఎంసీలకు పైగా కృష్ణా వరద జలాలు మళ్లించి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల సాగు, 640 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంగా గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు చేపట్టింది. 2006లో పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగా పీఆర్‌పీ హెడ్‌ రెగ్యులేటర్‌, 44 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌ఎంసీ), 20 క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ఎస్‌ఆర్‌బీసీ కెనాల్‌ విస్తరణ, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ విస్తరంచే పనులు చేపట్టారు. కాలువ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే.. ఏళ్లు గడస్తున్నా పలు పనులు అసంపూర్తిగా ఉండడంతో లక్ష్యం నీరుగారుతోంది.

20 ఏళ్లుగా అసంపూర్తి

బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి అవుకు రిజర్వాయరు వరకు శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఎస్సార్బీసీ (జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌) ప్రవహిస్తుంది. అక్కడి నుంచి కడప జిల్లా గండికోట జలశయానికి నీటిని మళ్లిస్తారు. నంద్యాల జిల్లాలో పలు వాగులు, వంకల దిగువన ఎస్సార్బీసీ ప్రవహిస్తుంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి అనుగుణంగా సూపర్‌ ప్యాసేజెస్‌ (కాలువ నది కాని, వాగు కాని దాటేటప్పుడు నది నీరు కాలువపై భాగంలో ప్రవహించే నిర్మాణం), ట్రాఫ్‌ అక్విడక్ట్స్‌, సింగిల్‌ లెవల్‌ బడ్జి (ఎస్‌ఎల్‌బీ)లు నిర్మించాల్సి ఉంది. దాదాపు ఇలాంటి నిర్మాణాలు ఇరవైకి పైగా ఉన్నాయి. 20 ఏళ్లు గడిచిపోతున్నా ఈ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలంటూ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపడం, పాలకులు పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. ఎస్సార్బీసీ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 10-15 వేల క్యూసెక్కులు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. ఫలితంగా కృష్ణా జలాలు కడలిపాలు అవుతున్నా కరువు రైతులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. ఎస్సార్బీసీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారుతోంది.

ముంపునకు గురవుతున్న పొలాలు

కీలకమైన ఆరు వాగులు, వంకలను ఎస్సార్బీసీ దాటి పూర్తి సామర్థ్యంతో నీటిని మళ్లించాలంటే సూపర్‌ ప్యాసేజెస్‌ నిర్మాణాలు అత్యంత కీలకం. ఇవి అసం పూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం పది వేల క్యూసెక్కులు కూడా తీసుకోవడం లేదు. అయితే.. కృష్ణా నదికి వరద పోటెత్తినప్పుడల్లా పూర్తి సామర్థ్యంలో నీటిని మళ్లించా లని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఆ సమయంలో 15-16 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సూపర్‌ ప్యాసేజెస్‌ పట్టక.. వంక, వాగులకు ఇరువైపుల ఉన్న రైతుల పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. 15 ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. నాలుగు ఐదు ప్రాంతాల్లో ట్రాఫ్‌ అక్విడక్ట్‌ (టీఏ)లు అసంపూర్తిగా అసంపూర్తిగా వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న సూపర్‌ ప్యాసేజెస్‌, టీఏలు, ఎస్‌ఎల్‌బీలను తక్షణమే పూర్తి చేసి రైతులకు అండగా నిలవాలని ఇటీవల జరిగిన నంద్యాల జిల్లా ఐఏబీ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఏకరువు పెట్టారు.

జూన్‌ ఆఖరులోగా పూర్తి చేయడానికి ప్రణాళిక

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్‌పీ హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గోరుకల్లు జలాశయం వరకు ఎస్‌ఆర్‌ఎంసీ, ఎస్సార్బీసీ కాలువ విస్తరణ పనులు రూ.1,509 కోట్లతో చేపట్టారు. ఈ పనులు చేపట్టిన ఆగ్రాకు చెందిన పీఎన్‌సీ ఇన్‌ఫ్రా సంస్థ రూ.300 కోట్లు విలువైన పనులు చేసింది. అందులో రూ.180 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంలో ఎస్సార్బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ విస్తరణ, అవుకు అదనపు టన్నెల్‌ పనులు రూ.1,100 కోట్లలో చేపట్టారు. డీఎస్‌ఆర్‌ సంస్థ పనులు చేపట్టింది. 70-80 శాతం పనులు పూర్తి చేశారు. దాదాపు రూ.300 కోట్లు బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఈ పనుల్లో భాగంగానే అసంపూర్తిగా ఉన్న ఎస్సార్బీసీ సూపర్‌ ప్యాసేజెస్‌, ట్రాఫ్‌ అక్విడక్ట్‌, ఎస్‌ఎల్‌బీలు పూర్తి చేసేందుకు ఇంజనీర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే బకాయి బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తారా..? అన్నది ప్రశ్నార్థకమే.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోగా పూర్తి చేయాలని లక్ష్యం

ఎస్సార్బీసీ పరిధిలో 20వరకు సూపర్‌ ప్యాసేజెస్‌, ట్రాఫ్‌ అక్విడక్ట్స్‌, ఎస్‌ఎల్‌బీలు అసంపూర్తిగా ఉన్నమాట నిజమే. అసంపూర్తి పనుల కారణంగా 20 వేలు క్యూసెక్కులు తీసుకోవాల్సి ఉంటే 15 వేల క్యూసెక్కులకు మించి తీసుకోలేకపోతున్నాం. వంకలు, వాగులు వద్ద కాలువ నీళ్లు పొలాల్లోకి వెళ్లి పంటలు ముంపకు గురవుతున్నాయని రైతుల ఆందోళన చెందుతున్నారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోగా అసంపూర్తి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే సీజన్‌లో 20 వేల క్యూసెక్కులు తీసుకోవడానికి పక్కా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

కబీర్‌బాషా, ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ, కర్నూలు

Updated Date - Dec 22 , 2025 | 11:10 PM