Share News

లైనింగ్‌ కూలిపోవడం ఏమిటి?

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:28 AM

పత్తికొండ నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ ఎస్‌ఎస్‌(హంద్రీనీవా సుజల స్రవంతి) కాలువకు సంబంధించి లైనింగ్‌ పనులు వేసి ఒక్కరోజులోనే కూలిపోవడం ఏమిటని అధికారులపై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

లైనింగ్‌ కూలిపోవడం ఏమిటి?
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులు నాణ్యతతో చేపట్టాలి

75 చెరువులకు నీరు నింపాలి

యూరియా కొరత రాకుండా చూడండి

జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

ముగిసిన జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

కర్నూలు, న్యూసిటీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ ఎస్‌ఎస్‌(హంద్రీనీవా సుజల స్రవంతి) కాలువకు సంబంధించి లైనింగ్‌ పనులు వేసి ఒక్కరోజులోనే కూలిపోవడం ఏమిటని అధికారులపై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్పీ మినీ సమావేశం భవనంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. చైర్మన్‌ అధ్యక్షత వహించగా సీఈవో నాసరరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ లైనింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 75 చెరువులకు వెంటనే నీరు నింపాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు సంబంధించి స్థానిక ప్రజల సలహాలు తీసుకోవాలన్నారు.

గతేడాది యూరియా కొరత ఉందని, ఈ సంవత్సరమైనా సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకుల్లో రైతులకు సబ్సిడీ రుణాలివ్వడం లేదని అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారు లకు తాగునీటి కోసం నిధులు మంజూరు చేసినా బిల్లులను సమర్పించడంలో నిర్లక్ష్యం ఎందుకు వహి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులిచ్చాక కూడా పనులు చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్‌ వెల్ఫేర్‌ కింద మంజూరు చేసిన నిధులకు సంబంధించి పూర్తి స్థాయి బిల్లులను జడ్పీకి త్వరితగతిన పంపాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి, చైర్మన్‌ సీసీ అశ్విని కుమార్‌, పరిపాలన అధికారి జితేంద్ర, జడ్పీటీసీలు, సుంకన్న, రంగనాథగౌడు, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల అఽధికారులు పాల్గొన్నారు.

తీర్మానాలు:

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాత భవనాన్ని 2019లో రత్నమయ్య అనే హోటల్‌ యజమాని హోటల్‌ నిర్వహణ కోసం దక్కించుకున్నారు. దానికి మరమ్మతులు చేసుకోవాల్సింది పోయి నేలమట్టం చేశాడు. దీనిపై జడ్పీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాలంలో రత్నమయ్యకు అనుకూలంగా కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాతభవనాన్ని యథావిధిగా నిర్మించడానికి రూ.1.25 కోట్లు ఖర్చు అవుతుందని పీఆర్‌ అధికారులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో హోటల్‌ యజమాని రూ.1.25 కోట్లు జడ్పీకి డిపాజిట్‌ చేయాలని సమా వేశంలో తీర్మానించారు.

అధికారులు గైర్హాజరు

స్థాయి సంఘ సమావేశాలకు ఉమ్మడి జిల్లాల కీలక శాఖ అధికారులు హాజరు కాలేదు. దీంతో కిందిస్థాయి అఽధికారులు హాజరు కావడంతో చైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. 60 రోజులకు ఒక్కసారి జరిగే స్థాయి సంఘ సమావేశాలకు జిల్లా అధికారులు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ల

డివిజనల్‌ డెవపల్‌మెంట్‌ కార్యాలయాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే విధంగా తీర్మానించారు. గడివేముల మండలంలో ఆర్‌వో ప్లాంటు నిర్మించరాదని తీర్మానించారు. జడ్పీ ఆవరణలో ఉన్న వాణిజ్య ప్రకటనలకు సంబంధించి గతంలో ఉన్న యజమాని వచ్చే సంవత్సరం మార్చి వరకు గడవు అడిగారు. అయితే పాతబకాయిలు చెల్లిస్తేనే గడువు పెంచేలా తీర్మానించారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు..

పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడు తున్నారని, ప్రభుత్వం రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అర్హులందరికీ బీమా వర్తింపజేయాలి. దేవనకొండ మండలం కుంకనూరులో ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. మరమ్మతులు చేపట్టాలి. మద్దికెర మండలంలో జగనన్న కాలనీలో జేజేఎం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని జడ్పీటీసీ కోరారు. - సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీ, కొత్తపల్లి

Updated Date - Jun 14 , 2025 | 01:28 AM