ఇన్‌చార్జి లేకుండా ఎలా నిర్వహిస్తారు..?
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:56 AM
టీడీపీ ఇన్‌చార్జి లేకుండా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? కార్యకర్తలకు ఏమని సంకేతాలు ఇస్తున్నారు..? అంటూ ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బి.వీరభద్రగౌడ్ వర్గం ఆగ్రహం చేశారు.

జిల్లా నాయకత్వంపై వీరభద్రగౌడ్ వర్గం ఆగ్రహం
‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
కర్నూలు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఇన్‌చార్జి లేకుండా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? కార్యకర్తలకు ఏమని సంకేతాలు ఇస్తున్నారు..? అంటూ ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బి.వీరభద్రగౌడ్ వర్గం ఆగ్రహం చేశారు. శనివారం ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, ఆలూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీరభద్రగౌడ్ వర్గీయులను పోలీసులు బయటకు తోసేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డౌన్.. డౌన్, టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్టినేటర్ల కమిటీ గోబ్యాంక్ అంటూ నినాదాలు చేశారు. ఆలూరు ఇన్‌చార్జి బి.వీరభద్రగౌడ్, కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం ప్రసాద్ వర్గాలు మధ్య వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ఇరువర్గాలు సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినా ఎవరిదారి వారిదే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. ఈ నెల 2 నుంచి టీడీపీ అధిష్ఠానం సుపరి పాలనలో తొలి అడుగు పేరిట ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరించాలని టీడీపీ శ్రేణులకు నెల రోజుల ప్రణాళిక ఇచ్చింది. ఆలూరు టీడీపీలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇన్‌చార్జి మంత్రి నిమ్మల, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పరిశీలకుడు పూల నాగరాజును టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్లుగా నియమించింది. ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఇక్కడ అడుగు కూడా పెట్టలేదు. శుక్రవారం ఎంపీ బస్తిపాటి నాగరాజు, పరిశీల కుడు పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ లేకుండా దేవనకొండ, చిప్పగిరి మండలాల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశాలు నిర్వహిం చారు. ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ వర్గీయులకు మింగుడు పడలేదు. శనివారం కూడా ఆస్పరి, ఆలూరులో ఇన్‌చార్జి లేకుండానే సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, వాల్మీకి కార్పోరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ హాజరయ్యారు. ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ వర్గీయులు ఆస్పరిలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్, సీనియర్ నాయకుడు సంజప్ప ఆధ్వర్యంలో, ఆలూరులో టీడీపీ ఎస్‌సీ సెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప, టీడీపీ మండల మాజీ కార్యదర్శి ముద్దు రంగయ్య, పట్టణ కార్యదర్శి మసాల జగన్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఇన్‌చార్జి లేకుండా ఎలా నిర్వహిస్తున్నారంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని బయటకు పంపించాక తొలి అడుగు సమా వేశాలు నిర్వహించారు. ఆలూరు సభలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ అధిష్ఠానం ఆదేశాల మేరకు వీరభద్రగౌడ్‌ను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించామని, జోన్-5 ఇన్‌చార్జి బీద రవిచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లగా అలాంటిదేమీ లేదని పేర్కొనడం కొసమెరుపు.