Share News

అర్హులందరికీ ఇళ్లు

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:39 PM

ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

అర్హులందరికీ ఇళ్లు
లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేస్తున్న మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

టిడ్కో గృహాల పూర్తికి రూ.18 కోట్లు

10 వేల ఇళ్ల పనులు మార్చి 31 నాటికి పూర్తి చేస్తాం

టిడ్కో ఇళ్ల పంపిణీలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు కల్చరల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సోమవారం జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ కాలనీలో నిర్మాణాలు పూర్తయిన టిడ్కో గృహాలను మంత్రి టీజీ భరత్‌, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కుడా చైౖర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌లు పంపిణీ చేశారు. ముందుగా నూతన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,61,040 టిడ్కో గృహాలు ఉండగా, వాటిలో 1.50 లక్షలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇందులో కర్నూలులోనే 10 వేల ఇళ్లు ఉండటం, మిలిగిన వాటి పూర్తి కోసం రూ.18 కోట్లు మంజూరు కావడం విశేషమన్నారు. 976 ఇళ్లలో తొలుత 187 ఇళ్లను ఇస్తున్నామని, మొత్తం 40 వేల మంది ఇక్కడ నివాసాలు ఏర్పడితే ఈ ప్రాంతం పట్టణంలా మారుతుందన్నారు. సమీపంలోనే పరిశ్రమలు రావడంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ మార్చి 31 లోగా 976 ఇళ్లను అందించగలమన్నారు. ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు రావడంతో 13 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, గత 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 92 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. టిడ్కోలో అన్ని వసతులతో పేదలకు అనువైన గృహాల నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టిడ్కో గృహాలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ, బొందిలి కార్పొరేషన్ల చైర్మన్లు పార్వత మ్మ, విక్రమ్‌సింగ్‌, బ్రాహ్మణ, వాల్మీకి, ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, తోళ్ల మంజునాథ్‌, బోయ రామాంజనేయులు, టిడ్కో ఎస్‌ఈ నాగమోహన్‌, ఎంఈలు సూర్యనారాయణ, గుప్త, అధికారులు పెంచలయ్య, మధు, కార్పొరేటర్లు పరమేష్‌, కైప పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:39 PM