బసవన్నలకూ హాలిడే!
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:14 AM
పని ఒత్తిడి మనుషులకే కాదు మూగ జీవాలకూ ఉంటుందని నమ్ముతారు
కోసిగి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): పని ఒత్తిడి మనుషులకే కాదు మూగ జీవాలకూ ఉంటుందని నమ్ముతారు కోసిగి మండలంలోని చిన్నభోంపల్లి గ్రామ రైతులు. అందుకే వారు తమ ఊరిలోని బసవన్నలకూ ఓ రోజు హాలిడే ఇచ్చి, సుందరంగా అలంకరించి, పిండివంటలను తయారు చేసి ఆ బసవన్నలకు ఇష్టంగా వడ్డిస్తారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న వస్తున్న ఆచారాన్ని చిన్నభోంపల్లి గ్రామస్థులు కొనసాగిస్తున్నారు. ఏరువాక సందర్భంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎద్దులను పొలాలకు తీసుకెళ్లకుండా మంగళవారం తమ ఇళ్ల వద్ద ఉంచుకుని వాటికి స్నానం చేయించి సుందంరగా అలంకరించారు. ఇంటిల్లి పాది ఆ ఎద్దులను దైవంగా భావించి పూజలు నిర్వహించి పిండివంటలను వాటికి సమర్పించారు. ప్రతిరోజు కష్టపడి అలసిపోయి ఉండడంతో ప్రత్యేకంగా ఏరువాక పండగ పూర్తయిన మరుసటి రోజు బసవన్నలకు సెలవు ఇస్తామని గ్రామస్థులు తెలిపారు.