మేలికరం మొక్కజొన్నతో అధిక దిగుబడి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:32 AM
మొక్కజొన్న పంటలో సరైన సీడ్‌తో పాటు మెలకువలు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కర్నూలు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటలో సరైన సీడ్‌తో పాటు మెలకువలు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మంగళవారం కల్లూరు మండలం దిన్నెదేవరపాడులో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆచార్య ఎన్జీరంగా, ధార్వాడ వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ విద్యార్థుల బృందం పర్యటించింది. మొక్కజొన్న రైతులతో మాట్లాడి జర్మినేషన్, మెట్టపొలాల్లో మొక్కజొన్న హైబ్రీడ్ సంపూర్ణ పరిశోధన, సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ 110 రోజుల్లో ఎకరా సాగులో 40 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే మొక్కజొన్న వంగడాలను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. మార్కెట్‌లో ఇందుకు సంబంధించిన విత్తనాలను చూసి కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రొనాల్డ్ రిగన్, లేపాక్షి సీడ్స్ కంపెనీ ఎండీ మడితాటి సురేష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.