సంబరాల్లోనూ కాసుల వేట
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:39 PM
ప్రజల సంబరాల్లోనూ కాసుల వేట మొదలు పెట్టారు కొందరు స్వార్థపరులు. తాత్కాలిక లైసెన్స్‌ల కోసం కొందరు వ్యాపారులు పోటీ పడుతున్నారు.
వ్యాపారుల సిండికేట్.. ఆకాశన్నంటిన బాణసంచా ధరలు
కర్నూలు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంబరాల్లోనూ కాసుల వేట మొదలు పెట్టారు కొందరు స్వార్థపరులు. తాత్కాలిక లైసెన్స్‌ల కోసం కొందరు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతులు ఇవ్వాలంటే పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. అదీకూడా రాజకీయ నాయకుల నుంచి సిఫార్సులు వస్తేనే ఎన్‌వోసీ జారీ చేస్తున్నారు.
ఒక్కో షాపునకు ఒక్కో రేటు..
ఒక్కో షాపుకు ఒక్కోరేటు చొప్పున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవంగా టపాసుల పెట్ట్టెలపై ఉన్న ఎమ్మార్పీ ధరలకు, అమ్మకం ధరలకు సంబంధం ఉండదు. ఉదాహరణకు పూల బాణాలు 10 కడ్డీల బాక్సు ఎమ్మార్పీ రూ.700 ఉంటే రూ.100-150లకు, తౌజండ్‌వాలా బాణాల పెట్ట్టె కంపెనీలను బట్టి ఎమ్మార్పీ రూ.2,500-3,000 ఉంటే రూ.450-500కే ఇస్తున్నారు.
ఎమ్మార్పీ కంటే తక్కువకే ఇస్తున్నామని దబాయింపు..
వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అసలు ధరకంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. అధిక ధరలను ప్రశ్నిస్తే ఎమ్మార్పీ కంటే తక్కువకే ఇస్తున్నాం కదా అని దబాయిస్తున్నారు. వ్యాపా రులందరికీ అనుమతి ఇస్తే వారిమధ్య పోటీ పెరిగి సరియైున ధరలకు అమ్ముతారు, దీంతో ప్రజలపై భారం తగ్గుతుంది. బాణసంచా అమ్మకాలు మొదలు ప్రభుత్వ శాఖల ఎన్‌ఓసీలు, తాత్కాలిక లైసెన్స్‌లు జారీ వరకు కీలక ప్రజా ప్రతినిధి ప్రోత్సాహంతో ఓ నాయకుడు పెత్తనం చెలాయించడం విమర్శలకు తావిస్తోంది.