ప్రైవేటు పాఠశాలల దోపిడీ
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:08 AM
పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి తెరతీశాయి. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.
తల్లిదండ్రులకు భారంగా ఫీజులు
పుస్తకాల ధరల మోత అదనం
నోటీస్ బోర్డుల్లో కనిపించని ఫీజుల వివరాలు
ఆలూరు, జూన్ 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి తెరతీశాయి. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఒకటి తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామాల్లో రూ.8వేలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో రూ.10వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు వత్రరమే వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికితోడు తాము ఎంత ఎక్కువగా ఫీజు నిర్ణయిస్తే తమ పాఠశాలకు అంత రేటింగ్ ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. జిల్లాలో 832 ప్రయివేట్ పాఠశాలలు ఉండగా 1.45 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
నియంత్రణ ఏదీ?
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై అధ్యయనం చేసేం దుకు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీలను నియమిం చింది. ఏ పాఠశాలలో ఎంత వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించి ప్రభుత్వా నికి అందజేయాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక కూడా ఇచ్చింది.
పుస్తకాల పేరుతో దోపిడీ
పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించే పుస్తకాలను మాత్రమే అనుసరించి బోధించాలి. కానీ ఒక్కో పాఠశాల ఒక్కో పబ్లికేషన్ సంస్థ పుస్తకాలను తల్లిదండ్రులకు అంటగడుతోంది. ఈ ప్తుకాలను తప్పక తీసుకోవలసిందేనని నిబంధన విధిస్తుండటంతో తల్లిదండ్రులు తమకు భారమైన కొనుగోలు చేస్తున్నాయి. ఐఐటీ ఓరియెంటెడ్ పేరుతో విక్రయిస్తూ వాటినే బోధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఇంటర్ స్థాయిలో ఉండే సిలబ్‌సను జోడించి పుస్తకాలను విక్రయిస్తున్నారు.
పర్యవేక్షణ చేయని విద్యాశాఖ అధికారులు
ఫీజుల నియంత్రణపై పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా చూసీ చూడనట్లు ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ తూతూ మంత్రంగా తనిఖీలు చేసి, నివేదికలు పంపుతున్నారు.
దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
ఫీజుల నియంత్రణ కమిటీని అమలుచేసి, వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి. పాఠశాలల్లో పుస్తకాల విక్రయాన్ని రద్దుచేయాలి. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకాధిరాని నియమిస్తే అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. - మైనా, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. ఫీజుల నియంత్రణకై చర్యలు చేపడతాం. - శ్యామ్యూల్‌పాల్, జిల్లా విద్యాశాఖాధికారి, కర్నూలు.