ఇక ప్రారంభమే..!
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:16 PM
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబరు చెప్పింది.
17న టిడ్కో గృహాల ప్రవేశానికి ముహుర్తం
తొలి విడత కర్నూలు నగరంలో 187 ఇళ్లు
మున్సిపాలిటీ, టిడ్కో అధికారుల సన్నాహాలు
మార్చి ఆఖరు నాటికి వంద శాతం పంపిణీ లక్ష్యం
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబరు చెప్పింది. మౌలిక వసతులు లేక.. పంపిణీకి నోచుకోక టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా పట్టణ పేదల సొంతింటి నిర్మాణం కలగానే మిగిలింది. కూటమి ప్రభుత్వం రావడంతో తక్షణమే పంపిణీ చేస్తారని ఆశించినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. 18 నెలలు గడిచిపోయాయి. రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. జూన్‌లో పంపిణీ చేస్తామన్నారు. నెలలు గడిచినా ఆ దిశగా చర్యలు శూన్యం. వైసీపీ హయాంలో ఐదేళ్లు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు నిండిపోయి శిథిలావస్థకు చేరడం, మౌలిక వసతులు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. తొలి విడతగా సోమవారం 187 ఇళ్ల గృహ ప్రవేశం చేయనున్నారు. దశల వారీగా 2026 మార్చి ఆఖరులోగా లబ్ధిదారులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల స్వంతింటి స్వప్నం సాకారం చేయాలనే లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ ఇళ్లు పథకం ఫేజ్-1 కింద కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల పట్టణాల్లో 27,976 ఏపీ టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. రూ.1,650 కోట్ల అంచనాతో షేర్‌వాల్ టెక్నాలజీతో జీ ప్లస్-3 ఇళ్ల సముదాయ నిర్మాణాలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన షాపూజీ,పల్లంజీ సంస్థ పనులు చేపట్టింది. ఏపీ టౌన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు పెట్టారు. కర్నూలు నగర శివారున బైపాస్ రోడ్డు పక్కన 10 వేలు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల పట్టణాల్లో 18,976, ఫేజ్-2 కింద డోన్, ఆళ్లగడ్డ 2,610 ఇళ్లు మంజూరు చేశారు. అంటే రెండు విడతల్లో 31,586 ఇళ్లకు గానూ 29,672 ఇళ్లు నిర్మాణాలు మొదలు పెట్టారు. 23,645 ఇళ్లను దాదాపుగా పూర్తి చేశారు. మౌలిక వసతులు కల్పించి గృహ ప్రవేశాలు చేయాల్సిన సమయంలో 2019 మేలో వైసీపీ ప్రభుత్వం రావడం టిడ్కో ఇళ్లకు శాపంగా మారింది. ఐదేళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ముళ్లపొదలు నిండిపోవడమే కాకుండా పలు ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కర్నూలు నగరంలో టిడ్కో ఇళ్లలో దొంగలు పడి రూ.కోట్లు విలువ చేసే విద్యుత్ వైర్లు, పరికరాలు దొచుకెళ్లారు.
మార్చి ఆఖరులోగా వంద శాతం
టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించి దశలవారీగా లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శనివారం గృహ ప్రవేశాలు చేయించాలని, 2026 మార్చి ఆఖరులోగా వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని మున్సిపల్, ఏపీ టిడ్కో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. మౌలిక వసతుల కల్పన, పెండింగ్ బిల్లుల చెల్లింపు, అసంపూర్తి పనులకు దాదాపు రూ.180.03 కోట్లు అవసరమైని అంచనా వేశారు. నిధులు ఇస్తేకానీ పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.
కావాల్సిన నిధులు రూ.కోట్లలో
పనులు కర్నూలు నంద్యాల
పెండింగ్ బిల్లులు 1.97 19.45
అసంపూర్తి పనులు 61.78 61.25
మౌలిక వసతులు 5.16 30.42
మొత్తం 68.91 111.12
ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఇళ్ల పురోగతి వివరాలు
నగరం/పట్టణం ఒప్పందం మొదలు పూర్తైన లబ్ధిదారులకు
చేసిన ఇళ్లు పెట్టినవి ఇళ్లు పంపిణీ చేసినవి
కర్నూలు నగరం 10,000 10,000 8,829 2,064
ఆదోని 4,704 4,720 3,494 1,632
ఎమ్మినూరు 4,272 4,272 4,272 1,920
నంద్యాల పట్టణం 10,000 9,000 5,370 2,096
డోన్ 306 288 288 --
ఆళ్లగడ్డ 2,304 1,392 1,392 1,392
మొత్తం 31,586 29,672 23,645 7,008
17 నుంచి దశలవారీగా గృహ ప్రవేశాలు
అసంపూర్తి పనులు పూర్తి చేసి దశల వారిగా టిడ్కో ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి ఆఖరులోగా వంద శాతం ఇళ్లు పేదలకు అప్పగించాలని లక్ష్యం. కర్నూలు నగరంలో సోమవారం 17న తొలి విడతగా 187 ఇళ్ల గృహ ప్రవేశాలకు ముహుర్తం ఖరారు చేశారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు సమస్య లేదు. కాంట్రాక్టర్ పనులు చేసి బిల్లులు పెట్టగానే అమరావతిలోని ఏపీ టిడ్కో హెడ్ ఆఫీస్‌కు పంపగానే బిల్లులు మంజూరవుతాయి.
- నాగమోహన్, ఎస్‌ఈ, ఏపీ టిడ్కో, కర్నూలు