ఒకరికొకరు సాయం చేసుకొని..
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:51 AM
కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఓ ముగ్గురు యువకులు ఒకరికి ఒకరు సహాయం చేసుకొని తప్పించుకున్న పలువురిని ఆశ్చర్యచకి తుల్ని చేస్తోంది.
ప్రమాదం నుంచి బయడపడ్డ ముగ్గురు
కర్నూలు క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఓ ముగ్గురు యువకులు ఒకరికి ఒకరు సహాయం చేసుకొని తప్పించుకున్న పలువురిని ఆశ్చర్యచకి తుల్ని చేస్తోంది. బెంగుళూరుకు చెందిన జయంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (సీటు నెం.యు7), మరో యువకుడు ఆకాశ్ ఏషియన్ పెయింట్ ్సలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ (సీటు యూ3), అశ్విన్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి(సీటు ఎల్1) ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వీరికి ఎటుపోవాలో అర్థం కాలేదు. డ్రైవర్ సీటువెనుక కుడివైపు ఉన్న అద్దాన్ని పగులగొట్టే ప్రయత్నం చేశారు. మొదట అద్దం ధ్వంసం కాలేదు. గట్టి ప్రయత్నం చేసి పగులగొట్టారు. అయితే అద్దం పగిలిన తర్వాత బయటవైపు ఐరన్ గిల్స్ ఉన్నాయి. అవి కూడా చిన్నచిన్న సందులతో ఉన్నాయి. ఆ సందుల్లోంచి బయటకు రావడం కష్టమైన పనే. అయితే ఈ ముగ్గురూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆ సందులోనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా, ఆకాశ్ అనే యువకుడు తన ల్యాబ్‌టాప్‌తో సహా బయట పడటం విశేషం. వీరి సెల్‌ఫోన్లు మాత్రం అక్కడే వదిలేశారు.
మూగబోయిన సెల్‌ఫోన్లు...
ప్రమాదంలో ప్రయాణీకులందరి సెల్‌ఫోన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ప్రయాణీకుల కోసం వారి వారి బంధువులు ఫోన్లు చేస్తుంటే స్వీచ్ ఆఫ్ రావడంతో, మృతుల కుటుంబ సభ్యులతోపాటూ, బతికి బయటపడ్డ వారి కుటుంబ సభ్యులు క్షేమ సమాచారం కోసం పడిన తిప్పలు వర్ణనాతీతం.
హెల్ప్‌డెస్క్ ఏర్పాటు..
మృతుల సమాచారం, ప్రమాదం నుంచీ బయటపడిన వారి సమాచారం కోసం పోలీసులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఘటన స్థలంలో ఉన్న కంట్రోల్ రూమ్ నెం.9121101061, పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ 9121101075 నెంబర్లు ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించారు. పలు సోషల్ మీడియాల్లో నెంబర్లు స్ర్కోల్ కావడంతో బాధితుల బంధువు లంతా ఈ నెంబర్లకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకున్నారు.