జిల్లాలో భారీ వర్షం
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:26 AM
జిల్లాలోని మొత్తం అన్ని మండలాల్లో 20మి.మీ మించి వర్షాపాతం నమోదయింది. అత్యధికంగా దేవనకొండలో 142.6 మి.మీ వర్షపాతం నమోదయింది.
దేవనకొండలో అత్యధికంగా 142.6 మి.మీ. వర్షపాతం నమోదు
పంటలు నీట మునగడంతో అన్నదాతల ఆవేదన
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మొత్తం అన్ని మండలాల్లో 20మి.మీ మించి వర్షాపాతం నమోదయింది. అత్యధికంగా దేవనకొండలో 142.6 మి.మీ వర్షపాతం నమోదయింది. ఆదోనిలో 126.2 ఎంఎం, మంత్రాలయం 99.4, ఎమ్మిగనూరు 88ఎంఎం, నందవరం 85.6, గోనెగండ్ల 83.6, పెద్దకడుబూరు 76.4, కౌతాళం 66.2, వెల్దుర్తి 65.6, ఆస్పరి 62.2, గూడూరు 59.6, సి.బెళగల్‌లో 58.8, కోడుమూరు 58.2, కల్లూరు 53.6, కర్నూలు అర్బన్‌లో 51.8 వర్షపాతం నమోదయింది. అలాగే కోసిగిలో 50.2 ఎంఎం, కర్నూలు రూరల్ 47.4, హొళగుంద 46.4, పత్తికొండ 46.2, క్రిష్ణగిరి 43.6, ఓర్వకల్లు 42.6, చిప్పగిరి 36.8, హాలహర్వి 34.4, మద్దికెర 31.6, తుగ్గలి 29.2, ఆలూరులో 25.6 మి.మీ వర్షపాతం నమోదయింది. ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా ఈస్థాయిలో అన్ని మండలాల్లో 25 ఎంఎం కంటే ఎక్కువ వర్షం నమోదు కావడం ఇదే తొలిసారి అని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిసి సగటున 62 మి.మీ వర్షపాతం నమోదయింది.
చేతికొచ్చిన పంటలు నీటిపాలు
కర్నూలు జిల్లాలో ప్రధాన పంటలన్నీ ప్రస్తుత వర్షాలకు నీటి ముంపునకు గురై చేతికందిన పంటలు నీటిపాలయ్యాయి. తెగుళ్లు, క్రిమికీటకాలు విజృంభించి మరింత నష్టానికి గురి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. శనివారం ఒడిశా, చత్తీస్‌ఘడ్ మధ్య తీరం దాటింది. దీంతో రాయలసీమ అంతటా మరో రెండు రోజులు ఎడతెరపి లేని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కలెక్టర్ సిరి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్ర, హంద్రీ, వక్కిలేరు తదితర నదుల తీరం వద్దకు వెళ్లవద్దని సూచించారు.
దంచికొట్టిన వర్షం
ఆదోని అగ్రికల్చర్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజామున వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతా లన్నీ జలమయమయ్యాయి. ఆవుదూడ వంక, మేక వంక, ఆర్టీసీ కాలనీ వెనుక వైపు నుంచి వెళ్లే ప్రధానమైన వంకలు పొంగిపొర్లాయి. ఆర్టీసీ కొత్త బస్టాండ్ వెనుక వంక పొంగి పొర్లడంతో విట్టాకిష్టప్ప నగర్, ఆర్టీసీ కాలనీ, వల్లభ శ్రీ హోమ్స్‌కు వెళ్లే రాకపోకలు నిలిచిపో యాయి. ఆవుదూడ వంక పొంగడంతో కౌడాల్ పేట, షేర్‌ఖాన్ కొట్టాల, బోయగిరి ప్రాంతాల్లో, డీఎస్పీ బంగ్లా సమీపంలో పెద్ద వంకకు భారీ నీరుచేరడంతో లోతట్టు ప్రాంత మైన శివశంకర్ నగర్‌లోని కొన్ని ఇళ్ళలోకి నీరు చేరాయి. కౌడల్‌పేట లోతట్టు ప్రాంతం లో నడుములోతు నీరు రావడంతో ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి ఉండడంతో టీడీపీ రాష్ట్ర నాయకుడు కొంకా భూపాల్ ౌదరి, మారుతినాయుడు స్పందించి ఆ కాలనీ టీడీపీ నాయకుడు సుబ్బుతో పాల ప్యాకెట్లు, అల్పాహారాన్ని, మధ్యాహ్నం అహారాన్ని సిద్ధపరిచి ఇంటిం టికి వెళ్లి పంపిణీ చేశారు.
బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆదూరి విజయ్ కృష,్ణ శ్రీనివాసాచారి కొంతమంది శివశంకర్‌నగర్‌లో పర్యటించారు. అక్కడి వారికి ఆహార పొట్లాలు అందజేశారు. తొమ్మిదేళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షం రావడంతో రాంజల చెరువు పొంగిపొర్లింది. ఆనీరంతా హౌసింగ్‌బోర్డ్ కాలనీలోకి వచ్చింది. 12.6 సెంటీమీటర్ల (126.8మి.మీ) వర్షపాతం నమోదైంది.
సబ్ కలెక్టర్ పర్యటన
జలమయమైన లోతట్టు ప్రాంతాలు కౌడాల్‌పేట, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎల్‌ఐజీ కాలనీలోని, టెలికాంనగర్, బావాజీపేటలోని ఇళ్లలోకి నీరు చేరడంతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ పర్యటించారు. వంకలు, కాలువలు ఆక్రమణ లకు గురికావడం విస్మయానికి గురయ్యారు. పారిశాధ్యాన్ని మెరుగుపరి చేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశారు.