కల్లూరులో భారీ వర్షం
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:05 AM
కల్లూరు మండలంలో గురువారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
పొంగిపొర్లిన వాగులు, వంకలు
పర్ల, తడకనపల్లె గ్రామస్థుల అవస్థలు
కల్లూరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): కల్లూరు మండలంలో గురువారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కల్లూరు మండలంలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన గూడూరు, సి.బెళగల్‌లో కురిసిన వర్షానికి వక్కెర వాగుకు వరద పోటెత్తింది. పర్ల గ్రామం ఊరి చివరన వక్కెరవాగు బ్రిడ్జిపై వరద ప్రవహిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సల్కాపురం గ్రామంలో వక్కెర వాగు ప్రమాదకరంగా మారింది.. అంతేకాకుండా చిన్నటేకూరు బిట్స్ కళాశాల సమీపంలోని రైల్వేబ్రిడ్జి కింద వరదనీరు ఉధృతంగా ప్రవ హించింది. దీంతో తడకనపల్లె గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లో వర్షం నీరు నిలవడంతో పత్తి, మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.