దంచికొట్టిన వర్షం
ABN , Publish Date - May 22 , 2025 | 12:42 AM
మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
కోడుమూరు మండలంలో 47.6 మి.మీ
పదునెక్కిన పొలాలు
కోడుమూరు రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి): మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆరుబయట నిద్రిస్తున్న జనం ఇళ్లలోకి పరుగులు తీశారు. సుమారు గంటకుపైగా వర్షం పడడంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పంటకుంటలు, చెక్‌డ్యాంలు వర్షపునీటితో నిండిపోయాయి. గోరంట్ల వద్ద హంద్రీనదికి ఎగువ నుంచి వరద భారీగా పోటెత్తింది. దీంతో హంద్రీనదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టిరోడ్డు కోతకు గురైంది. దీంతో అవతలి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, పొలాలకు వెళ్లే రైతులు అవస్థలు పడుతూనే హంద్రీ దాటుతున్నారు. ఇక్కడ వరద నీటితో బైక్‌లు, ఆటోలు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో హంద్రీనదిలో వంతెన నిర్మాణం చేపట్టగా పెండింగ్ బిల్లుల కారణంగా పనులు పిల్లర్ దశలో ఆగిపోయాయి. కాగా మే నెల లో వర్షాలు జోరందుకోవడంతో రైతన్నలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పొలాలు పదునెక్కాయని విత్తుకు అవకాశం ఉందన్నారు. మండలంలో 47.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
లక్ష్మీపురంలో వర్షానికి కుంగిన బ్రిడ్జి
కల్లూరు: కార్పొరేషన పరిధిలోని 28వ వార్డు లక్ష్మీపురంలో మంగళవా రం తెల్లవారుజామున కురిసిన వర్షానికి గంజి వాగుపై రైతులు కల్లాల కు వెళ్లే దారిలో బ్రిడ్జి కుంగింది. విషయం తెలుసుకున్న కార్పొరేషన కమిషనర్ ఎస్.రవీంద్రబాబు బుధవారం గ్రామానికి సందర్శించి బ్రిడ్జిని పరిశీలించారు. వర్షం నీటి ఉధృతికి గురై బ్రిడ్జి కుంగిందని, రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కమిషనర్ వెం ట జడ్పీ మాజీ చైర్మన ఆకెపోగు వెంకటస్వామి, అధికారులు ఉన్నారు.