Share News

శ్రీశైలం జలాశయానికి భారీ వరద

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:24 AM

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వచ్చిచేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి భారీ వరద
శ్రీశైలం జలాశయంలోకి చేరిన వరద జలాలు

ఇప్పటి నీటి లభ్యత 184.2774 టీఎంసీలు

879.30 అడుగులకు చేరిన నీటి మట్టం

మంగళ, బుధవారాల్లో గేట్ల ఎత్తివేత?

అనుమతి కోసం అధికారుల ఎదురుచూపులు

నంద్యాల, జూలై6(ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వచ్చిచేరుతోంది. ఎగువ ఉన్న తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, జూరాల జలాశయాల గేట్లు ఇప్పటికే ఎత్తారు. దీంతో దిగువన శ్రీశైలం జలాశయానికి పెద్దఎత్తున వరద కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 1,09,216 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 67,218 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో నీటి లభ్యత 184.2774 టీఎంసీలు ఉండగా నీటి మట్టం 879.30 అడుగులకు చేరింది. వీటితో పాటు విద్యుత్‌ ఉత్పాదన కింద జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 67,019క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

తుంగభద్రలో 100 టీఎంసీలు..

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకు వచ్చిన నీటిని వచ్చిన ట్లుగానే దిగువకు వదిలి పెడుతున్నారు. తుంగభద్రలో 100 టీఎంసీలు కెపాసిటీ ఉండగా.. సుమారు 80శాతం నిండింది. జలాశయం నుంచి 55 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 80 వేల క్యూసెక్కుల మేర వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. దీంతో కుడి, ఎడమ జల ఉత్పాదన కేంద్రాలను పూర్థిస్థాయిలో నడుపుతున్నారు. వీటి ద్వారా 67 వేలు క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు చేరుతోంది.

అధికారులు అందుబాటులో ఉండాలని..

శ్రీశైలం జలాశయం గేట్లను అతి త్వరలోనే ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆ శాఖాధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. భారీగా వరద వచ్చి చేరడంతో.. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. ఏక్షణంలోనైనా జలాశయం గేట్లు తెరిచే అవకాశం ఉందని, జలాశయం అధికారులందరూ అందుబాటులోని ఉండాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఆశాఖ అధికారులు గేట్లు ఎత్తడానికి అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈక్రమంలో అధికారులు కూడా అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది.

ఉత్కంఠ...

215 టీఎంసీలు పూర్తి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే సుమారు 185 టీఎంసీలు ఉండటంతో ఉత్కంఠ రేపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీశైలం జలాశయం ఫుల్‌ అన్నట్లైంది. ఈనేపథ్యంలో మంగళ, బుధవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఆశాఖవర్గాల నుంచి తెలిసింది. అధికారులు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారని సమాచారం. ఏది ఏమైనా శ్రీశైలం జలాశయం నీరు ఎప్పుడు విడుదల చేస్తారో..? అని అందర్నిల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇదే క్రమంలో రైతుల్లో ఆసక్తి నెలకుంది. ఇదిలా ఉండగా.. రేపు నంద్యాల కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ది సలహా మండలి (డీడీఆర్‌సీ) సమావేశం ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో రిటైర్డు చీఫ్‌ ఇంజనీర్‌ కన్నయ్యనాయుడు కూడా జలాశయాన్ని పరిశీలనకు వచ్చారని సమాచారం.

Updated Date - Jul 07 , 2025 | 12:24 AM