Share News

పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:14 PM

పరిశుభ్రమైన పరిసరాలు, సమాజంతోనే ఆరోగ్యంగా జీవించగలమని కలెక్టర్‌ సిరి అన్నారు.

పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
నన్నూరు పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ సిరి

కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

ఓర్వకల్లు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన పరిసరాలు, సమాజంతోనే ఆరోగ్యంగా జీవించగలమని కలెక్టర్‌ సిరి అన్నారు. శనివారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర..స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. వ్యక్తిగత, సహజ పరిశుభ్రత థీమ్‌తో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్‌ పాల్గొని, జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు సమాజ పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. చిన్నప్పటి నుంచి నుంచి అలవాట్లు నేర్పిస్తే జీవితాంతం పిల్లలు అదే బాటలో పయనిస్తారని తల్లిదండ్రులకు సూచించారు. రాబోయే తరం పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా మట్టిని, గాలిని, నీటిని సంరక్షించుకొని వారికి ఇవ్వాలన్నారు. జిల్లాలో 56శాతం మాత్రమే అక్షరాస్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు చదువుకునేందుకు అనేక అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వంట గదిని పరిశీలిస్తూ మోను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని వంట సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, డీపీఓ భాస్కర్‌, ఎంపీడీఓ నాగ ఆనసూయ, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, రమణారెడ్డి, సర్పంచ్‌ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:14 PM