కర్నూలు గడ్డపై దేశాధినేత
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:16 AM
జనం.. ప్రభంజనం.. న‘మోదీ’జనం.. కర్నూలు గడ్డపై కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రధాని మోదీ సభ సూపర్ సక్సెస్‌గా నిలిచింది
జనం.. ప్రభంజనం.. న‘మోదీ’జనం.. కర్నూలు గడ్డపై కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రధాని మోదీ సభ సూపర్ సక్సెస్‌గా నిలిచింది. 20 రోజులుగా మోదీ పర్యటన ఏర్పాట్ల ఫలితంగా ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభ విజయవంతం కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఎదుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సుపరిపాలన పేరుతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో మహిళలు కందనవోలు వైపు అడుగులు వేశారు. డిప్యూటీ సీఎం, అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను చూసేందుకు వచ్చిన యువత కేరిం తలు, కోలాహలం మరో వైపు.. వెరసి ఓర్వకల్లు మం డలం నన్నూరులో నిర్వహించిన ప్రధాని సభ విజయవంతమైంది. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా తమ అభిమాన నేతలను చూసేందుకు తరలివచ్చారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, భద్రతలో కేంద్ర బలగాలు... ఇలా ఎవరికి వారు తమ విధులను బాధ్యతగా నిర్వహించడంతో సభ సాఫీగా సాగింది. ఇదే క్రమంలో ప్రధాని మోదీ రాష్ట్రంతో పాటు రాయలసీమకూ వరాలజల్లు కురిపించారు. అందులోనూ కర్నూలుకు తన పూర్తి సహ కారం ఉంటుందంటూ భరోసానిచ్చారు. ‘సౌరాష్ట్రే సోమనాథ.. శ్రీశైలే మల్లికార్జున..’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించగా... మధ్యలో మహానందీ శ్వర స్వామి, అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలంటూ ప్రసంగించారు. ఇదిలా ఉండగా ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ఉయ్యాలవాడ పేరు వినగానే ప్రజలు హర్షధ్వానాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.