రైతు కళ్లల్లో ఆనందం
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:27 PM
ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.
‘అన్నదాత సుఖీభవ’ అమలు
మొదటి విడతగా రూ.136.38 కోట్లు రైతుల ఖాతాలకు జమ
జిల్లాలో 2,77,752 మంది రైతులకు లబ్ధి
లబ్ధిదారుల్లో ఆలూరు, పత్తికొండ ప్రాంత రైతులే అధికం
నేడు ప్రారంభించనున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎప్పుడెప్పుడా అని రెండు నెలలుగా ఎదురుచూస్తున్న ‘అన్నదాత సుఖీభవ’కు మోక్షం లభించనుంది. శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఏ ఒక్క రైతు నష్టపోకుండా అర్హులైన ప్రతి రైతుకు అందించేందుకు రెండు నెలలుగా శ్రమించి ఎంతో పకడ్బందీగా రైతుల జాబితాను సిద్ధం చేసింది. తొలి విడత జిల్లాలోని 2,72,752 మంది రైతులకు రూ.136.38 కోట్లను రైతులకు అందించనున్నారు. కరువు ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన రైతులు ఎక్కువ లబ్ధి పొందనున్నారు.
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరియనుంది. ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అందులో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం శనివారం ఆచరణలోకి రానుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని కలుపుకుని రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంతో అనుసంధానించి శనివారం తొలి విడత జిల్లాలోని 2,72,752 మంది రైతులకు రూ.136.38 కోట్లను రైతులకు అందించనున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ఏటా ఇచ్చే రూ.6వేలకు మరో రూ.7,500 కలిపి రూ.13,500లను రైతుభరోసా పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించింది.
ప్రజా ప్రభుత్వం ఒక్కో రైతుకు..
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.14వేలను అన్నదాత సుఖీభవ పేరుతో అందించేందుకు శ్రీకారం చుట్టింది. పీఎం కిసాన్‌తో అనుసంధానం చేసి కేంద్రం అందించే రూ.6వేలు కలిపి మొత్తం రూ.7వేలు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం ఏడాదిలో మూడు విడతలుగా ఒక్కోసారి రూ.2వేల వంతున రైతుల ఖాతాలో జమ చేస్తుండగా.. అదే రీతిలో రాష్ట్రప్రభుత్వం కూడా రూ.14వేలను మూడు విడతలుగా అందించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం తొలివిడత నగదు జమలను ఆగస్టు 2నుంచి రైతుల ఖాతాలకు జమ చేయను న్నారు.
లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు
‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఏ ఒక్క రైతు నష్టపోకుండా అర్హులైన ప్రతి రైతుకు అందించేందుకు రెండు నెలలుగా శ్రమించి ఎంతో పకడ్బందీగా రైతుల జాబితాను సిద్ధం చేసింది. దీంతో మొదటి విడతలో పెద్దగా అభ్యంతరాలు చోటు చేసుకోలేదు. తొలుత వెబ్‌ల్యాండ్ ఆధారంగా మొత్తం రైతు కమతాలను గుర్తించి వారిలో పథకం నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రైతులను గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులను అర్హుల జాబితా నుంచి మినహాయించారు. ఆ తర్వాత ఒక కుటుంబంలో ఒకరికే లబ్ది ఉండేలా కుటుంబ సర్వేను చేశారు. అదే విదంగా ఆదార్‌తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లను ఈకేవైసీ చేయించారు.
ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో..
కర్నూలు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,72,752 మందిని అర్హుల జాబితాలో చేర్చారు. వీరందరికీ శనివారం రూ.7వేల చొప్పున మొత్తం రూ.136.38 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. ఈకార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో భారీఎత్తున చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
నియోజకవర్గం రైతులు జమ కానున్న
మొత్తం
(రూ.లలో) కోట్లలో
కర్నూలు అర్బన్ 295 రూ.0.15 లక్షలు
కోడుమూరు 35,082 రూ.17.526 కోట్లు
ఎమ్మిగనూరు 38,318 రూ.19.159 కోట్లు
ఆదోని 18,722 రూ.9.36 కోట్లు
మంత్రాలయం 41,992 రూ.20.996 కోట్లు
పత్తికొండ 54,774 రూ.27.387 కోట్లు
ఆలూరు 63,317 రూ.31.6585 కోట్లు
పాణ్యం
(ఓర్వకల్లు, కల్లూరు) 20,287 రూ.10.1435 కోట్లు .
2,72,752 రూ.136.38 కోట్లు
ఈ పట్టికను పరిశీలిస్తే కరువు ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, నియోజకవర్గాలకు ఎక్కువ మంది రైతులు లబ్ధిదారులుగా చేరినట్లు స్పష్టం అవుతుంది.