Share News

చేనేతల ఆశాకిరణం టెక్స్‌టైల్‌ పార్క్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:14 PM

బనవాసి వద్ద ఏర్పాటు చేసే టెక్స్‌టైల్‌ పార్క్‌ పాతికేళ్ల స్వప్నం. 2001-02లో నాటి పురపాలక శాఖ మంత్రి ఎమ్మెల్యే బీవీ మోహనరెడ్డి ‘బనవాసి జెర్సీ పశుక్షేత్రం’లో టెక్స్‌టెల్స్‌ పార్క్‌ (అప్పెరల్‌ పార్క్‌) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

   చేనేతల ఆశాకిరణం టెక్స్‌టైల్‌ పార్క్‌
టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆదోని సబ్‌ కలెక్టర్‌, చేనేత, జౌళి శాఖ ఏడీ తదితరులు

ఎమ్మిగనూరులో ఉపాధి లక్ష్యంగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు రూపకల్పన

2003లో నాటి మంత్రి బీవీ మోహనరెడ్డి శంకుస్థాపన

2014లో వంద ఎకరాల కేటాయింపు

రూ.వంద కోట్లతో మౌలిక వసతులకు ప్రతిపాదనలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దు

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి చొరవతో భూ కేటాయింపులు

నేడు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

బనవాసి వద్ద ఏర్పాటు చేసే టెక్స్‌టైల్‌ పార్క్‌ పాతికేళ్ల స్వప్నం. 2001-02లో నాటి పురపాలక శాఖ మంత్రి ఎమ్మెల్యే బీవీ మోహనరెడ్డి ‘బనవాసి జెర్సీ పశుక్షేత్రం’లో టెక్స్‌టెల్స్‌ పార్క్‌ (అప్పెరల్‌ పార్క్‌) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చంద్రబాబును ఒప్పించి 2004లో శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించింది. పదేళ్ల తరువాత 2015లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తండ్రి బీవీ మోహనరెడ్డి కల సాకారం కోసం సీఎం చంద్రబాబును ఒప్పించి ఒప్పించి వంద ఎకరాలు కేటాయించి, రూ.వంద కోట్లతో మౌళిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు చేశారు. పనులు మొదలయ్యే సమయంలో.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక భూములు రద్దు చేసి అటకెక్కించింది. ఆ పార్క్‌ రద్దు చేసిన రెండుసార్లు కూడా అప్పటి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, యువగళం పాదయాత్రలో యవనేత నారా లోకేశలపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి దివంగత తండ్రి బీవీ మోహనరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే 77.35 ఎకరాలు టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం ఏపీఐఐసీకి కేటాయించారు. నేడు సీఎం చంద్రబాబు వర్చూవల్‌ ద్వారా భూమి పూజ చేయబోతున్నారు. ఇందుకోసం జౌళి, చేనేత శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్నూలు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు చేనేతల పురిటిగడ్డ. మగ్గాలపై నేతన్నలు తయారు చేసిన నూలు (కాటన) వసా్త్రలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. దివంగత పద్మశ్రీ మాచాని సోమప్ప దూరదృష్టితో ‘ఎమ్మిగనూరు చేనేతల సహకార సొసైటీ’ స్థాపించి చేనేత కార్మికులకు ఉపాధి చూపించారు. ఎమ్మిగనూరు పట్టణం సహా నందవరం, నాగులదిన్నె, గోనేగండ్ల, గుడేకల్లు, ఆదోని, కోసిగి ప్రాంతాల్లో దాదాపు 25 వేలకు పైగా చేనేత కుటుంబాలు నేతమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సహకార, సహకారేతర రంగాల్లో చేనేత వస్త్ర ఉత్పత్తితో బతుకుబండి లాగిస్తున్నారు. కాలక్రమేణ చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు వచ్చాయి. వాటి పోటీ తట్టుకోలేక చేనేత మగ్గాలు చితికిల పడ్డాయి. అదే సమయంలో వేలాది మందికి ఉపాధి చూపిన ఎమ్మిగనూరు స్పిన్నింగ్‌ (నూలు) మిల్లు మూతపడింది. అర్థాకలితో అలమటిస్తున్న చేనేత కార్మికులకు ఉపాధి చూపించాలనే లక్ష్యంగా 2001-02లో అప్పటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బీవీ మోహనరెడ్డి బనవాసి జెర్సీ పశుక్షేత్రంలో ‘టెక్స్‌టైల్‌ (అప్పెరల్‌) పార్క్‌’ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబును ఒప్పించారు. 2004 ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించింది. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో చేనేత కార్మికుల టెక్స్‌టైల్‌ పార్క్‌ ఆశలు ఎండమావిగా మారాయి.

ఫ పదేళ్ల తరువాత వంద ఎకరాలు

పదేళ్ల తరువాత 2014 ఎన్నికల్లో దివంగత మాజీ మంత్రి బీవీ మోహనరెడ్డి తనయుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి కల సాకారం కోసం అప్పటి సీఎం చంద్రబాబును ఒప్పించి 2015లో పశుసంవర్ధక శాఖ పరిధిలోని బనవాసి జెర్సీ పశుక్షేత్రానికి చెందిన వంద ఎకరాలు టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతుల కోసం రూ.98 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తమిళనాడు, గుజరాత, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పర్యటించి పలు గార్మెంట్‌ తయారి పరిశ్రమలు ఇక్కడకు ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. అయితే 2019లో కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం ఆ పార్క్‌కు కేటాయించిన భూములు రద్దు చేసింది. అప్పుడు కూడా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డినే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం రెండు పర్యాయాలు టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే.. 2004లో కాంగ్రెస్‌, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రకోట రాజకీయ దురుద్ధేశంతోనే టెక్స్‌టైల్‌ పార్క్‌ రద్దు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.

ఫ నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఎమ్మిగనూరు తేరు బజారులో ఎన్నికల ముందు జరిగిన బాదుడే బాదుడు సభలో ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు, యువగళం పాదయాత్రలో భాగంగా వీవర్స్‌ కాలనీ మైదానంలో జరిగిన సభలో యువనేత నారా లోకేశ టైక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలుదీరిన తరువాత ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సీఎం చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశను ఒప్పించి బనవాసి జెర్సీ పశుక్షేత్రంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి 77.35 ఎకరాలు కేటాయించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు 42 టెక్స్‌టైల్‌ పార్కులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగానే ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌ పార్క్‌కు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే బీవీ రెవెన్యూ, జౌళి, చేనేత విభాగం అధికారులతో కలసి భూమి పరిశీలించారు. మౌలిక వసతులు కల్పనకు త్వరలోనే డీపీఆర్‌ తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని జౌళి, చేనేత శాఖ ఏడీ నాగరాజురావు ఆంధ్రజ్యోతికి వివరించారు. ఈ పార్క్‌ ఏర్పాటు ద్వారా నూలు మిల్లు, గార్మెంట్స్‌ యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏడీ తెలిపారు. అలాగే 20 ఎకరాల్లో ప్రేమ్‌ మగ్గాలు ఏర్పాటు చేసి చేనేతలకు ఉపాధి కల్పించేందుకు ఎమ్మెల్యే బీవీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:14 PM