సగమే సాగు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:27 AM
: కర్నూలు జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,78,094 హెక్టార్లు కాగా.. రబీ ముగిసిపోతున్నా కూడా కేవలం 41,078 హెక్టార్లకే (38 శాతాని)కే పంటల సాగు పరిమితమైంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వ్యవసాయ శాఖ అధికారవర్గాలు తెలిపాయి.
రబీ ముగుస్తున్నా 41,078 హెక్టార్లే సాగు
ఖరీఫ్ నష్టాలతో ముందుకు సాగలేని రైతులు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,78,094 హెక్టార్లు కాగా.. రబీ ముగిసిపోతున్నా కూడా కేవలం 41,078 హెక్టార్లకే (38 శాతాని)కే పంటల సాగు పరిమితమైంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వ్యవసాయ శాఖ అధికారవర్గాలు తెలిపాయి. గత ఖరీఫ్‌లో వర్షాలు, తుఫాన్లతో రైతులు భారీగా నష్టపోయారు. ఈ పరిస్థితి రబీ సీజన్‌లోనూ వెంటాడుతుందేమోనని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో పాటు రబీలో పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి బ్యాంకుల నుంచి అందకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. చేతికందిన పంటలకు నామమాత్రంగానే మద్దతు ధర లభిస్తుండటంతో ప్రధాన పంటల సాగు పై రైతులు ఆసక్తి చూపించలేదు. అక్టోబరు నుంచి మొదలైన రబీ సాగు ఇప్పటికీ దాదాపు పూర్తి కావాల్సి ఉంది. అయితే.. సగం కూడా సాగు కాని పరిస్థితి జిల్లాలో నెలకొంది. వరి సాగు సాధారణ విస్తీర్ణం 4,314 హెక్టార్లు కాగా, కేవలం 15 హెక్టార్లు మాత్రమే ఇప్పటికీ సాగైంది. అదే విధంగా జొన్న 9,790 హెక్టార్లకు గాను 2,468 హెక్టార్లు సాగైంది. సజ్జ 788 హెక్టార్లుకు గాను 48 హెక్టార్లు మాత్రమే సాగైంది. మొక్కజొన్న 6,558 హెక్టార్లుకు గాను 2,912 హెక్టార్లలో సాగైంది. శనగ 59,608 హెక్టార్లకు గాను 33,079 హెక్టార్లలో, వేరుశనగ 15,499 హెక్టార్లకు 860 హెక్టార్లలో సాగైంది. పొద్దుతిరుగుడు 376 హెక్టార్లకు రెండు హెక్టార్లలోనే సాగు చేశారు. ఆముదం 129 హెక్టార్లకు గాను ఇంత వరకు ఒక్క హెక్టారులో కూడా విత్తనం పడలేదు. పొగాకు 1,743 హెక్టార్లు సాగు చేయాల్సి ఉండగా.. కేవలం 1,314 హెక్టార్లకే పరిమితైంది. వాము 1,616 హెక్టార్లకు ఇంతవరకు ఒక హెక్టారులో కూడా విత్తనం వేయలేని పరిస్థితి నెలకొంది. మిరప 810 హెక్టార్లకు దారుణంగా 45 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం మీద రబీలో అన్ని పంటలు కేవలం 41,076 హెక్టార్లలోనే సాగు కావడం దారుణం.
మిగిలిపోయిన 110 క్వింటాళ్ల విత్తనం
ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ప్రధాన పంటలకు సంబంధించి రాయితీపై విత్తనాలు అందజేస్తుంది. అయితే.. ఈసారి రబీ సీజన్‌లో రాయితీ విత్తనాలను రైతులకు అందించేందుకు ఏపీ సీడ్స్ సంస్థ చర్యలు తీసుకున్నా రైతుల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించలేదు. మార్కెట్‌లో లభించే ధరనే ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి విత్తనాలు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. జిల్లాలో రబీ సీజన్‌లో 22 మండలాల రైతులు శనగ పంటను సాగు చేస్తారు. వీరి కోసం ఏపీ సీడ్స్ సంస్థ 23,898 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించింది. ఈ రాయితీ విత్తనాలను 15 మండలాల్లోనే రైతులు తీసుకున్నారు. హొళగుంద, హాలహర్వి, ఎమ్మిగనూరు, క్రిష్ణగిరి, నందవరం, గోనెగండ్ల తదితర మండలాల్లో రైతులు ఎవరూ విత్తనం కోసం ఆసక్తి చూపలేదు. మొత్తం మీద లక్ష్యంలో సగం 12,786 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే రైతులు తీసుకున్నారు. 11,110 క్వింటాళ్ల విత్తనం మిగిలిపోయింది. నంద్యాల జిల్లాలో 24 మండలాలకు గాను 12,314 క్వింటాళ్ల రాయితీ విత్తనాలను కేటాయించారు. అయితే.. ఆళ్లగడ్డ, చాగలమర్రి, ప్యాపిలి తదితర మండలాల రైతులు విత్తనాలను తీసుకోలేదు. కేవలం 11,878 క్వింటాళ్ల విక్రయమే జరిగింది. కర్నూలు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో ప్రధాన పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. శనగ పంట సాగు 59,608 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 34,027 హెక్టార్లలోనే సాగైంది. నంద్యాల జిల్లాలో 59,881 హెక్టార్లుకు గాను కేవలం 45,549 హెక్టార్లలోనే ఈ పంట సాగు కాడం గమనార్హం.
కంది పంటకు ధర వస్తుందనే ఆశతో ...
కంది పంటకు కేంద్ర ప్రభుత్వం రూ.8వేల మద్దతు ధర ప్రకటించింది. దీంతో ఖరీఫ్‌లోనే ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 69,530 హెక్టార్లు కాగా, ఖరీఫ్ నెలాఖరు నాటికి 1,11,757 హెక్టార్లలో ఈ పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట కాయదశలో ఉంది. దీనివలనే శనగ సాగు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి రబీ సీజన్‌లో ప్రధాన పంటల సాగు తగ్గిపోవడంపై వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతుందన్నారు.