హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:00 AM
కూటమి ప్రభుత్వం యువతతోపాటు విద్యార్థులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ
కర్నూలు న్యూసిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం యువతతోపాటు విద్యార్థులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం నగరంలో వైసీపీ యువత పోరు ర్యాలీ చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో జిల్లా అధ్యక్షుడితోపాటు మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, వీరుపాక్షిలు ఉన్నారు. అనంతరం కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబా బు ఎన్నికల ముందు విద్యార్థులు, యువకులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. ఏమి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన బాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతికి రానున్న బడ్జెట్‌లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాటని ప్రభుత్వమే నడపాలని, చేతకాకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాదరెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్‌చార్జిలు బుట్టా రేణుక, ఆదిమూలపు సతీష్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సుభాష్‌చంద్రబోసు, నాయకులు అహ్మద్ అలీఖాన్, రుద్రగౌడు, తెర్నేకల్ సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.