Share News

ఉల్లి రైతులకు భరోసా

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:28 AM

రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని మొత్తం కొనుగోలు చేసి వారికి భరోసా కల్పిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి. నవ్య తెలిపారు.

ఉల్లి రైతులకు భరోసా
రైతులతో మాట్లాడుతున్న జేసీ నవ్య

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని మొత్తం కొనుగోలు చేసి వారికి భరోసా కల్పిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి. నవ్య తెలిపారు. ఇప్పటికే క్వింటా రూ.1,200తో కొనుగోలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాలకు వ్యత్యాసం ఉన్న నగదును జమ చేస్తున్నామన్నారు. శుక్రవారం జేసీ నవ్యతో పాటు మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు, డీడీ ఉపేంద్ర, ఏడీఎంలు సత్యనారాయణ చౌదరి, నారాయణమూర్తి, కర్నూలు మార్కెట్‌ కమిటి సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మితో కలిసి రైతులతో మాట్లాడారు. రైతులు తెచ్చిన ఉల్లిలో 6,749 క్వింటాళ్లు వ్యాపారస్థులతో కొనుగోలు చేయించామని, మిగిలిన 5,576 క్వింటాళ్ల ఉల్లిని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని జేసీ వివరించారు. మీరు తెచ్చిన ప్రతి ఉల్లి గడ్డను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి రైతుకు క్వింటాకు రూ.1,200 ధర అందిస్తున్నామనీ స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.కోటి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. రైతులు పక్వానికి వచ్చిన ఉల్లినే మార్కెట్‌ కు తీసుకురావాలని, పొలాల వద్దనే గ్రేడింగ్‌ చేసి తెస్తే యార్డులో అమ్మకం కోసం కష్టాలు పడాల్సిన ఇబ్బంది ఉండదని జేసీ తెలిపారు. రైతులు తెచ్చిన ఉల్లిని త్వరితగతిన కొనుగోలు చేసి బయటకు తరలించాలని వ్యాపారులు, మార్క్‌ఫెడ్‌ అధికారులును జేసీ ఆదేశించారు. జేసీ వెంట కర్నూలు మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ శేషగిరిశెట్టి, అసిస్టెట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, కోడుమూరు సెక్రటరీ సుందర్‌రాజు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నగేష్‌, శివన్న తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:28 AM